తండ్రీ కూతురు కలిసి సైలెంటుగా..

ఒక స్టార్ హీరో, ఆయన కొడుకు కలిసి సినిమా చేస్తే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుంది. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు, మోహన్ బాబు-మంచు విష్ణు, నాగార్జున-నాగచైతన్య.. ఇలా ఈ వరుసలో చాలామంది తండ్రీ కొడుకుల జోడీలను చూశాం. త్వరలోనే చిరంజీవి-చరణ్‌లను పూర్తి స్థాయి పాత్రల్లో చూడబోతున్నాం. ఐతే హీరో-కొడుకు కలిసి కనిపించినట్లు హీరో-కూతురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదు.

అసలు హీరోల కూతుళ్లు సినిమాల్లోకి రావడమే తక్కువ. వచ్చినా తండ్రితో కలిసి నటించిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఐతే తెలుగు తెరపై ఈ అరుదైన కలయికను త్వరలోనే చూడబోతున్నాం. సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన పెద్ద కూతురు శివాని కలిసి కనిపించబోతున్నారు ఓ సినిమాలో. ఆ చిత్రమే.. శేఖర్. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్‌కు తనయురాలిగా కీలక పాత్రలో కనిపించబోతోంది శివాని.

ముందు ఈ పాత్రకు వేరే అమ్మాయిని అనుకున్నారట. కానీ తర్వాత శివానితోనే ఈ సినిమా చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రాజశేఖర్ భార్య జీవితనే కావడం విశేషం. ముందు లలిత్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు కానీ.. తర్వాత సినిమాను జీవితనే టేకప్ చేశారు. ఇలా ఓ మహిళా దర్శకురాలు.. భర్త, కూతురిని కలిపి డైరెక్ట్ చేయబోతుండటం విశేషమే.

సినిమాలో ఈ అమ్మాయి పాత్ర నిడివి తక్కువే కానీ.. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అదేంటన్నది తెరమీదే చూడాలి. ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మలయాంలో ఈ పాత్రను జోజు జార్జ్ చేశాడు. ఆయన నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘శేఖర్’ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఆ రోజు రావాల్సిన ‘ఆచార్య’ వాయిదా పడినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.