బాలయ్య.. వాటర్ బాటిళ్లు.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినోత్సవం జరుగుతోంది ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. అలాగే ఇండస్ట్రీ జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బాలయ్యకు జన్మదిన శుభకాంక్షలు చెబుతూ ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన గొప్పదనం గురించి మాట్లాడుతున్నారు.

సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ.. బాలయ్య ప్రత్యేకతను చాటి చెప్పే ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్యకు డబ్బుకు ఎంత విలువ ఇస్తాడో.. అవసరమైన చోట ఎంత పొదుపు చేస్తాడో.. అలాగే సాయం అవసరమైన చోట ఎంత ఉదారంగా వ్యవహరిస్తాడో తెలియజేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు.

కొన్నేళ్ల కిందటే చెన్నైలో ఓ వేడుకలో పాల్గొనేందుకు బాలయ్యతో కలిసి వెళ్లాడట శివాజీ రాజా. కార్లో తాను, బాలయ్య కలిసి వెళ్తుండగా.. చెన్నైతో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాడట బాలయ్య. ఉన్నట్లుండి మధ్యలో కారు ఆపమని డ్రైవర్‌కు చెప్పిన బాలయ్య.. పక్కన ఒక షాపులోకి వెళ్లి 25 వాటర్ బాటిళ్లు కొని తనే వాటిని మోసుకుంటూ వచ్చి కార్లో పెట్టాడట. ఇదేంటి బాబూ అని అడిగితే.. మనం వెళ్లబోయేది ఫైవ్ స్టార్ హోటల్‌కు.. అక్కడ వాటర్ బాటిల్‌కు వంద రూపాయల పైన వేస్తారు. ఎందుకు అంత పెట్టడం అన్నాడట బాలయ్య.

ఇక హోటల్లోకి వెళ్తుండగా వెంకటేష్ కనిపించి ఈ వాటర్ బాటిళ్లేంటి అని అడిగితే.. తాను విషయం చెప్పానని.. బాలయ్య చేసింది కరెక్టే అని వెంకీ కూడా అన్నాడని.. అంత పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్లిద్దరూ అలా మాట్లాడటం చూసి షాకయ్యానని శివాజీ రాజా వెల్లడించాడు. తర్వాత ఒకసారి బాలయ్య ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కోసం పిలిచాడని.. అక్కడ ఓ అనాథాశ్రమానికి చెందిన వాళ్లు ఉన్నారని.. వాళ్ల కోసం బాలయ్య చెక్ రాసి ఇచ్చాడని.. అందులో నంబర్ చూసి వాళ్లు షాకైపోయారని.. వాళ్లు కోరుకున్నదానికంటే పది రెట్ల మొత్తం విరాళమివ్వడమే అందుక్కారణమని.. బాలయ్యది ఎంత మంచి మనసో చెప్పడానికి ఇది ఉదాహరణ అని శివాజీ రాజా చెప్పుకొచ్చాడు.