సినీ పరిశ్రమలో ఎవరి శ్రమకు తగ్గ గుర్తింపు వారికి దక్కదనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా రచయితలకు సరైన గుర్తింపు కానీ, వారి శ్రమకు తగ్గ పారితోషకాలు కూడా ఇవ్వరు అన్నది వాస్తవం. పేరున్న రచయితల సంగతి పక్కన పెడితే చాలామందికి అన్యాయమే జరుగుతుంటుంది. కథ కోసం రచయితల సహకారం తీసుకుని, వాళ్ల ఆలోచనలతోనే స్క్రిప్టును తీర్చిదిద్దుకుని వాళ్లకు సరైన క్రెడిట్ ఇవ్వకుండా ‘రచన’ కింద తమ పేరే వేసుకునే దర్శకులు చాలామందే ఉన్నారిక్కడ.
ఒకవేళ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే పారితోషకం ఇవ్వమని.. పారితోషకం కావాలంటే క్రెడిట్ వదులుకోవాలని కూడా కండిషన్లు పెడుతుంటారు. ఆ పారితోషకాలైనా సరిపడా ఇస్తారంటే అదీ ఉండదు. ఐతే చాలా కొద్దిమంది దర్శకులు మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంటారు. అందులో సుకుమార్ ఒకడన్నది మెజారిటీ జనాలు చెప్పే మాట.
సుకుమార్ తన ప్రతి సినిమాకూ కనీసం అరడజను మంది రచయితలతో పని చేస్తాడు. వాళ్ల సహకారం తీసుకుంటేనే స్క్రిప్టులో తన ముద్ర ఉండేలా చూసుకుంటాడు. కథ, స్క్రీన్ ప్లే తన పేరే వేసుకున్నా రచనా సహకారం, మాటల క్రెడిట్ తన కోసం పని చేసిన రచయితలందరికీ ఇస్తాడు. సుక్కు సినిమాల టైటిల్స్ పరిశీలిస్తే రచనా సహకారం, అడిషనల్ స్క్రీన్ ప్లే, మాటలు అన్న క్రెడిట్స్ కింద ప్రతిసారీ చాలా పేర్లే కనిపిస్తాయి. ఇలా క్రెడిట్ ఇస్తూనే నిర్మాతలతో అందరికీ రెమ్యూనరేషన్ కూడా ఇప్పిస్తాడనే పేరుంది సుక్కుకు.
‘పుష్ప’ విషయంలో అదే చేశాడని, ఎవరికీ అన్యాయం చేయలేదని సమాచారం. అంతే కాక తన డైరెక్షన్ టీంలో ప్రతి ఒక్కరికీ పారితోషకాలు కాకుండా తన తరఫున ఒక్కొక్కరికి లక్ష రూపాయల బోనస్ ఇచ్చాడని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇది కాక ‘పుష్ప’ థ్యాంక్ యు మీట్లో మాట్లాడుతున్నపుడు సెట్ బాయ్స్, కెమెరా డిపార్ట్‌మెంట్లో పని చేసే కింది స్థాయి వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.లక్ష బోనస్ ప్రకటించి శభాష్ అనిపించుకున్నాడు. మరోవైపు గేయ రచయిత చంద్రబోస్‌ను వేదిక పైకి పిలిచి ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడ్డమే కాక పాదాభివందనం చేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడు సుక్కు. ఇప్పటికే ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో చాలా మంచి పేరున్న సుక్కు ఈ చర్యలతో మరింతగా అందరినీ మెప్పించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates