పండ‌గ చేసుకున్న బ‌న్నీ, నాని

క్రిస్మస్ వీకెండ్ తెలుగు సినిమాలకు బాగానే కలిసొచ్చినట్లుగా కనిపిస్తోంది. గత శుక్రవారం పండుగ కానుకగా నాని సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక గత వారం విడుదలైన ‘పుష్ప’ను కొత్త సినిమా తరహాలో మెజారిటీ థియేటర్లలో హోల్డ్ చేశారు. చాలా చోట్ల నాని సినిమా కంటే కూడా బన్నీ మూవీని ఎక్కువ థియేటర్లలో కొనసాగించడం విశేషం. ఈ రెండు చిత్రాలూ క్రిస్మస్ వీకెండ్‌ను చాలా బాగా ఉపయోగించుకున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్యామ్ సింగ రాయ్, పుష్ప చిత్రాలు హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యాయి. ‘శ్యామ్ సింగ రాయ్’కి కాస్త పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ.. సినిమా అంచనాలకు తగ్గట్లు లేదన్నది వాస్తవం. అందులోనూ అది సీరియస్ మూవీ కావడం, ‘పుష్ప’తో పోటీ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఏమేర ప్రభావం చూపుతుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తొలి వారాంతంలో గట్టిగా నిలబడింది.

‘శ్యామ్ సింగ రాయ్’ వసూళ్లు తొలి రోజు తర్వాత డ్రాప్ కాలేదు. 2, 3 రోజుల్లోనూ కలెక్షన్లు తొలి రోజుకు దీటుగా వచ్చాయి. సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. ఆదివారం మేజర్ సిటీలన్నింట్లో మ్యాట్నీలు, ఫస్ట్ షోలు, సెకండ్ షోలకు ఫుల్స్ పడ్డాయి. ఇక ఫస్ట్ వీకెండ్ తర్వాత చల్లబడ్డట్లుగా కనిపించిన ‘పుష్ప’ వీకెండ్లో గట్టిగా పుంజుకుంది. శని, ఆదివారాల్లో ఈ చిత్రానికి కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. నైజాంలో ఈ చిత్రం దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయినట్లే కనిపిస్తోంది. రూ.36 కోట్లకు నైజాం హక్కులు కొన్న దిల్ రాజు.. సేఫ్ జోన్లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. రాయలసీమలో కూడా సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువ అవుతోంది.

ఆంధ్రాలో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కు చాలా దూరంలో కనిపిస్తోంది. కానీ ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా అన్ని చోట్లా క్రిస్మస్ వీకెండ్లో మాత్రం ‘పుష్ప’కు మంచి వసూళ్లు వచ్చాయి. యుఎస్‌లో ‘పుష్ప’ ఆల్రెడీ 2 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది. సెకండ్ వీకెండ్లో అక్కడ వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఇండియాలో నాన్ తెలుగు వెర్షన్లు అంచనాలకు మించి వసూళ్లు రాబడుతున్నాయి. హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లు ఆల్రెడీ బయ్యర్లను లాభాల బాట పట్టించాయి.