ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల గొడవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దశాబ్దం కిందటి టికెట్ల రేట్లకు సంబంధించిన జీవోను బయటికి తీసి ఆ మేరకే ధరలు ఉండాలంటూ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. పెద్ద సిటీలు, పట్టణాల సంగతి ఓకే కానీ.. చిన్న టౌన్లు, నగర, గ్రామ పంచాయితీల్లో రేట్లే మరీ దారుణంగా ఉన్నాయి. ఆ ప్రకారం టికెట్లు అమ్మి మనుగడ సాగించడం చాలా కష్టంగా ఉంది థియేటర్ల యాజమాన్యాలకు.
ఈ విషయమై ఎగ్జిబిటర్ల నుంచి నిర్మాతల వరకు ఎవరు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టు వదలట్లేదు. సమస్య రోజు రోజుకూ ముదిరి ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నప్పటికీ దాని గురించి గట్టిగా మాట్లాడే వాళ్లే కరవయ్యారు. చాలా కొద్ది మంది మాత్రమే సమస్య గురించి నోరు విప్పుతున్నారు. పెద్ద పెద్ద స్టార్లు సైలెంటుగా ఉంటే నాని లాంటి మీడియం రేంజ్ హీరో ఈ సమస్యపై తన బాధను వెళ్లగక్కుతున్నాడు.
తన కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ పెట్టుకుని.. ఏపీలో జరుగుతున్నది కరెక్ట్ కాదంటూ నాని మొన్న గట్టిగా వాయిస్ వినిపించాడు. సినిమా థియేటర్ల కౌంటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టు కౌంటర్ మెరుగ్గా ఉందని కూడా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో అతడి సినిమాకు ఇబ్బందులు తలెత్తాయి కూడా. అయినా నాని ఏమీ తగ్గట్లేదు. సినిమా టికెట్ల గొడవకు అసలు మూలం ఎక్కడుందనే విషయమై అతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అసలీ సమస్య ‘వకీల్ సాబ్’ సినిమాతో మొదలైందని అతను వ్యాఖ్యానించాడు. అప్పుడే ఇండస్ట్రీలో అందరూ స్పందించి ఉంటే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదని అతను పేర్కొనడం గమనార్హం.
అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు సినిమా టికెట్ల ఊసే ఎత్తని జగన్ సర్కారు.. పవన్ సినిమా ‘వకీల్ సాబ్’ విడుదలప్పుడే విడ్డూరంగా టికెట్ల ధరల నియంత్రణ మీద దృష్టిపెట్టింది. ఇక్కడ టార్గెట్ పవన్ కళ్యాణే అన్నది స్పష్టం. ఐతే తర్వాత ఈ సమస్య మొత్తం ఇండస్ట్రీకి చుట్టుకుని అందరూ ఇబ్బంది పడుతున్నారు. బడా స్టార్లందరూ జగన్ సర్కారుకు భయపడి మౌనంగా ఉంటే నాని తన సినిమా రిలీజ్ పెట్టుకుని కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతుండటం అభినందనీయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates