‘భీమ్లా నాయక్’తో ఆ భయం కూడానా?

‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడిపోయింది. సంక్రాంతి పక్కా పక్కా అని నొక్కి వక్కాణించి చివరికి రేసు నుంచి తప్పుకున్నారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమా వాయిదా పడటానికి ముఖ్య కారణంగా ‘ఆర్ఆర్ఆర్’యే అనడంలో మరో మాట లేదు. అనుకోకుండా వచ్చి సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం కారణంగా ఆల్రెడీ ‘సర్కారు వారి పాట’ వాయిదా పడింది.

‘భీమ్లానాయక్’ టీం తగ్గేదే లే అంటూ రెండు నెలలుగా పట్టుదలతో కనిపించింది కానీ.. ఎట్టకేలకు ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ‘ఆర్ఆర్ఆర్’కు ‘భీమ్లా నాయక్’ భయపడి వెనక్కి తగ్గినట్లుగా లేదు. ‘భీమ్లా నాయక్’ను చూసి ‘ఆర్ఆర్ఆర్’ మేకర్సే భయపడ్డట్లే ఉంది. అంటే భయం అంటే కేవలం ‘కంటెంట్’ కోణంలో చూడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉండే క్రేజ్ వేరు. పైగా ‘భీమ్లా నాయక్’కు హైప్ బాగానే ఉంది. ఈ స్థాయి సినిమాకు పెద్ద సంఖ్యలోనే థియేటర్లు అవసరం పడతాయి.

దీని వల్ల తొలి వారంలో మెజారిటీ థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ను నడిపించడం కష్టమవుతుంది. కనీసం వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ను నడిపిస్తేనే వాటి బయ్యర్లకు అనుకున్న స్థాయిలో లాభాలు వస్తాయన్న అంచనా ఉంది. అందుకే ‘భీమ్లా నాయక్’ వాయిదా కోసం ఇంతగా ఒత్తిడి తెచ్చారు. దీనికి తోడుగా ఇంకో భయం కూడా దీన్ని రేసు నుంచి తప్పించడానికి కారణమని అంటున్నారు. పవన్ సినిమా అంటే ఏపీ సర్కారు కచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల రేట్ల విషయంలో మరీ పట్టుదలతో వ్యవహరిస్తుంది.

ఈ నెల ఆరంభంలోవచ్చిన ‘అఖండ’ విషయంలో బెనిఫిట్ షోలు, అదనపు షోల విషయంలో చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ ‘పుష్ప’కు వచ్చేసరికి పట్టుబట్టి అదనపు షోలను నియంత్రించారు. అంటే ఎవరి సినిమా అనేదాన్ని బట్టి ప్రభుత్వ చర్యలుంటాయన్నమాట. ఐతే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో ఉంటే.. వారం వ్యవధిలో రిలీజయ్యే మూడు సినిమాల్లో ఒక్కో దానికి ఒక్కోలా వ్యవహరించడానికి వీలుండదు. అదనపు షోలు, టికెట్ల రేట్ల విషయంలో ఏమైనా వెసులుబాటు ఉంటే అన్నిటికీ ఇవ్వాల్సి ఉంటుంది.

పవన్ సినిమా బరిలో ఉంటే దాని పట్ల జగన్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తుంది. అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’; ‘రాధేశ్యామ్’ చిత్రాలకూ ఇబ్బంది తప్పదు. ‘భీమ్లా నాయక్’ రేసు నుంచి తప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు చిత్రాల మేకర్స్ లాబీయింగ్ చేసి అదనపు షోలు, టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు తెచ్చుకోవడానికి అవకాశముంది. సంక్రాంతి పేరు చెప్పి ఏమైనా మినహాయింపులు తెచ్చుకున్నా తెచ్చుకుంటారేమో. ఇక ‘భీమ్లా నాయక్’కు వచ్చేసరికి ఆటోమేటిగ్గా నిబంధనలు కఠినతరం అయిపోతాయన్నది అర్థం చేసుకోదగ్గ విషయమే.