మనోడు అజిత్‌ను మించి.. హైలైట్


ఆర్ఎక్స్ 100 మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేసి బోలెడ‌న్ని అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ‌. ఐతే సినిమాలు ఎంచుకోవ‌డంలో మ‌రీ తొంద‌ర‌ప‌డ‌టంతో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఎదుర‌య్యాయి. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత ఇప్ప‌టిదాకా అత‌డికి స‌రైన హిట్ లేదు. అలాగ‌ని అత‌డికి సినిమాలైతే ఆగిపోవ‌ట్లేదు. ఓవైపు హీరోగా చేస్తూనే ఇంకోవైపు గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో విల‌న్ పాత్ర‌తోనూ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు కార్తికేయ‌.

ఆ పాత్ర చూసి ఇచ్చారో.. లేక మామూలుగానే కార్తికేయ మీద గురి కుదిరిందో కానీ.. త‌మిళంలో వలిమై అనే భారీ చిత్రంలో విల‌న్ పాత్ర‌కు కార్తికేయ‌ను ఎంచుకున్నారు. అజిత్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో విల‌న్ పాత్ర చేయ‌డ‌మంటే మాట‌లు కాదు. మ‌రి అజిత్‌కు దీటుగా కార్తికేయ నిల‌బ‌డ‌గ‌ల‌డా.. పెర్ఫామ్ చేయ‌గ‌ల‌డా అని సందేహించిన వారికి ఆ మ‌ధ్య రిలీజైన టీజ‌ర్‌తోనే స‌మాధానం చెప్పాడు కార్తికేయ‌.

ఇప్పుడు వ‌లిమై మేకింగ్ వీడియో ఒక‌టి రిలీజ్ చేయ‌గా.. అందులో అజిత్‌ను మించి కార్తికేయ హైలైట్ కావ‌డం విశేషం. కార్తికేయ‌కున్న పెద్ద బ‌లం అత‌డి బాడీనే. దాన్ని ఎలివేట్ చేసే దృశ్యాలే చూపించారు మేకింగ్ వీడియోలో. వీపు మీద పెద్ద బ‌రువు పెట్టుకుని పుష‌ప్స్ చేస్తున్న దృశ్యం వావ్ అనిపించింది. ఒంటి మీద ఫుల్లుగా టాటూలు వేయించుకుని కండ‌లు తిరిగిన దేహంతో స్ట‌న్నింగ్‌గా క‌నిపించాడు కార్తికేయ‌. ఇంకో చోట కూడా సెట్లో ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న దృశ్య‌మే చూపించారు. ఒక ద‌శ వ‌ర‌కు వీడియోలో అత‌నే హైలైట్ అయ్యాడు.

ఐతే చివ‌ర్లో అజిత్ చేసిన బైక్ స్టంటు వారెవా అనిపించింది. ఆ విన్యాసం చేస్తూ అజిత్ కింద‌ప‌డ్డ దృశ్యం చూపించారు వీడియోలో. ఇలాంటి స్టంట్స్ రియ‌ల్‌గా చేసే హీరోలు చాలా అరుద‌నే చెప్పాలి. బేసిగ్గా అజిత్ మోటార్ బైక్ రేస‌ర్ కావ‌డంతో ఇది చేయ‌గ‌లిగిన‌ట్లున్నాడు. అజిత్ మ‌ళ్లీ లేచి ఆ విన్యాసాన్ని పూర్తి చేసిన‌ గూస్ బంప్స్ షాట్‌తో ఈ వీడియోను ముగించారు. అలాగే వ‌లిమై సంక్రాంతికే రాబోతున్న‌ట్లు కూడా అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం.