ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు అమెరికా సహా ప్రపంచ దేశాల్లో విడుదలై ఆ తర్వాత నెలకో రెండు నెలలకో ఇండియాకు వచ్చేవి. ఆల్రెడీ పెద్ద హిట్టయిన సినిమాలను నెమ్మదిగా డబ్ చేసి ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేసేవాళ్లు. కానీ గత పది పదిహేనేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు రిలీజవుతాయో అదే రోజు ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి.
కొన్నిసార్లు ఇండియాలోనే ముందు హాలీవుడ్ సినిమాలను రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి క్రేజున్న ఫ్రాంఛైజ్ సినిమాలు మన ప్రాంతీయ చిత్రాలకు దీటుగా భారీ ఎత్తున రిలీజవుతుంటాయి. ఇక్కడ భారీ చిత్రాల స్థాయిలో వాటికి హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తుంటాయి. ఈ గురువారం రిలీజవుతున్న స్పైడర్ మ్యాన్ః నో వే హోమ్ కూడా అలాంటి క్రేజ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇంగ్లిష్ సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ 2డీ, 3డీ వెర్షన్లలో రిలీజవుతున్న స్పైడర్ మ్యాన్ సినిమాకు ఇండియాలో మామూలు క్రేజ్ లేదు. వివిధ భాషల్లో దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఈ వీకెండ్లో వివిధ భాషల్లో పుష్ప మూవీ మంచి హైప్‌తో రిలీజవుతుండగా.. ఒక రోజు ముందే స్ట్రాటజిగ్గా స్పైడర్‌మ్యాన్‌ను విడుదల చేస్తున్నారు. దీంతో ఆ ఒక్క రోజు ఈ చిత్రానికి ఇండియా వైడ్ వసూళ్ల మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా లేని స్థాయిలో దీనికి తొలి రోజు కలెక్షన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మామూలుగా హాలీవుడ్ చిత్రాలను మల్టీప్లెక్సుల్లోనే ఎక్కువ రిలీజ్ చేస్తారు. కానీ స్పైడర్ మ్యాన్‌ను మాత్రం గురువారం ఒక్క రోజు పెద్ద ఎత్తున సింగిల్ స్క్రీన్లలోనూ ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ డే రూ.30 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజైన చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్ కావడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండిట్లు. మరుసటి రోజు పుష్ప ఈ రికార్డును దాటే అవకాశముంది.