RRR ఇప్పుడే ఇలా ఉంటే..

ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. మూణ్నాలుగు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే చర్చ. దేశవ్యాప్తంగా అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ ఈ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ నెల 9న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్ కాగా.. ముందు రోజు నుంచే సోషల్ మీడియా చర్చలన్నీ దీని చుట్టే తిరిగాయి. ఇక ట్రైలర్ లాంచ్ అయ్యాక పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ను ఈ ట్రైలర్ ఒక ఊపు ఊపేసింది. అందులోని హైలైట్ల గురించి పెద్ద చర్చే నడిచింది. ట్రైలర్ చూశాక సినిమా ఎలా ఉంటుందో అన్న ఊహల్లోకి వెళ్లిపోయారంతా.

మీడియాలో.. సోషల్ మీడియాలో ఉన్న సందడంతా సరిపోదన్నట్లు.. ఆఫ్ లైన్ ప్రమోషన్లతో రెండు మూడు రోజుల పాటు హోరెత్తించేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం. 9న ముంబయి.. 10న బెంగళూరు, చెన్నై, కోచి నగరాల్లో.. 11న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రతి చోటా ప్రెస్ మీట్లు సుదీర్ఘంగానే సాగాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా విస్తృతంగా ఈ ప్రెస్ మీట్లను కవర్ చేసింది.

ఇండియాలో ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలు, త్వరలో విడుదలకు సిద్ధమైన చిత్రాలు.. అన్నీ పక్కకు వెళ్లిపోయి ‘ఆర్ఆర్ఆర్’ వార్తలే మీడియాను కమ్మేశాయి. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే రాజమౌళి అండ్ కో ఈ రేంజిలో ప్రమోషన్లు చేయడం.. ఈ సినిమాకు ఈ స్థాయిలో మీడియాలో కవరేజీ దక్కడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వేరే సినిమాల మేకర్స్ అసూయ కూడా చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ దగ్గర పడేసరికి ప్రమోషన్ ఇంకెంత రేంజిలో ఉంటుందో.. మీడియా కవరేజి ఇంకే స్థాయిలో ఉంటుందో అనుకుంటున్నారు.

వేరే చిత్రాలను వేటికీ ‘ఆర్ఆర్ఆర్’ స్పేస్ ఇవ్వదేమో అన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. మామూలుగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు మేజర్ సిటీస్‌లనే చేస్తారు కానీ.. చిన్న చిన్న నగరాల్లో కూడా ప్రమోషనల్ ఈవెంట్లను ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్లాన్ చేస్తోందని.. ‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని హైప్‌ను ఈ సినిమాకు తీసుకురావడానికి భారీ ప్రణాళికలే ఉన్నాయని.. విడుదలకు ముందు చివరి రెండు వారాల్లో ప్రమోషన్లు హోరెత్తిపోతాయని చిత్ర వర్గాల సమాచారం.