అలా అయితే ఆర్ఆర్ఆర్ డౌటే

ఇప్ప‌టికే మూడుసార్లు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేసింది చిత్ర బృందం. ఒక‌సారి త‌మ ఆల‌స్యం వ‌ల్ల డేట్ మార్చాల్సి వ‌స్తే.. ఇంకో రెండుసార్లు క‌రోనా దెబ్బ‌కు విడుద‌ల వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. చివ‌రికి జ‌న‌వ‌రి 7వ తేదీకి సినిమాను షెడ్యూల్ చేసి.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ రోజే సినిమాను రిలీజ్ చేయాల‌ని చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ముందే తెలుగులో సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకున్న చిత్రాల‌కు పోటీగా ఆర్ఆర్ఆర్‌ను నిల‌బెట్ట‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తినా.. డేట్ మార్చాల‌ని ఒత్తిడి వ‌చ్చినా ఆర్ఆర్ఆర్ టీం త‌గ్గ‌లేదు. పైగా సంక్రాంతికే రావాల‌నుకుంటున్న భీమ్లా నాయ‌క్‌కు డేట్ మార్పించ‌డానికి చూస్తోంది. హిందీలో కూడా గంగూబాయి చిత్రాన్ని పోటీ నుంచి త‌ప్పించారు. ఇలా చాలా వ‌ర‌కు అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు కానీ.. ఇప్పుడు వాళ్లు ఊహించ‌ని ఇబ్బంది ఎదుర‌య్యేలా క‌నిపిస్తోంది.


క‌రోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ కేసులో ఇండియాలో కూడా వెలుగు చూడ‌టం, మామూలుగా కూడా కేసుల సంఖ్య నెమ్మ‌దిగా పెరుగుతుండ‌టంతో కొత్త వేవ్ త‌ప్ప‌దేమో అన్న ఆందోళ‌న క‌లుగుతోంది. రాబోయే రోజుల్లో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు త‌ప్ప‌వంటున్నారు. క‌ర్ణాట‌క అయితే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటేనే థియేట‌ర్ల‌లోకి ప్ర‌వేశం అంటోంది. మ‌ళ్లీ ఆక్యుపెన్సీ విష‌యంలో కొన్ని రాష్ట్రాలు ఆంక్ష‌లు విధిస్తాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసులు మ‌రింత పెరిగితే మాత్రం దేశ‌వ్యాప్తంగా సినిమాల‌కు మ‌ళ్లీ ప్ర‌తికూల ప‌వ‌నాలు వీయ‌డం గ్యారెంటీ. ఐతే రాబోయే రెండు మూడు వారాల్లో వ‌చ్చే సినిమాల‌కు ఇబ్బంది లేక‌పోవ‌చ్చు.

ఆ త‌ర్వాత ప్ర‌ధానంగా పాన్ ఇండియా సినిమాల‌కే ఇబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు ఉండ‌క‌పోవ‌చ్చేమో. తెలంగాణ నుంచి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఏపీలో సంక్రాంతి స‌మ‌యానికి ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. ఐతే ఆర్ఆర్ఆర్ మీద వివిధ భాష‌ల్లో భారీగా పెట్టుబ‌డులు పెట్టిన నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌లు వ‌చ్చినా ఈ సినిమాను వాయిదా వేయ‌డం అనివార్యం అవుతుంది. ఈ విష‌యంలో చిత్ర బృందంలో ఆల్రెడీ టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. ప్ర‌స్తుతానికి వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభించ‌బోతున్నారు.