ఫిలిం సెలబ్రిటీ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్ కనిపిస్తే చాలు.. నిజంగా ఆ అకౌంట్ ఆ వ్యక్తి దేనా కాదా అని వెరిఫై చేసుకోకుండా వందలు వేల మంది వాటిని అనుసరించేస్తుంటారు. ఆ అకౌంట్ ఆ సెలబ్రెటీదే అనిపించేలా నాలుగు మాటలు చెప్పి.. కొన్ని పర్సనల్ ఫొటోలు పెడితే చాలు గుడ్డిగా నమ్మేసి ఫాలో అయిపోతుంటారు. ఐతే ఇలాంటి అకౌంట్ల నుంచి ఆ సెలబ్రెటీలకు డ్యామేజ్ చేసేలా ఏవైనా పోస్టులు పడ్డప్పుడు రగడ మొదలవుతుంది.
ఆ సెలబ్రెటీలు, లేదా వాళ్ల తరఫు వాళ్లు తేరుకుని క్లారిటీ ఇచ్చాక కానీ జనాలకు వాస్తవం బోధ పడదు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు.. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటారో తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో ఎక్కడా అకౌంట్లేమీ లేవు. ఐతే త్రివిక్రమ్ పేరు మీద ట్విట్టర్ అకౌంట్లు చాలానే ఉన్నాయి.
అలాంటి ఓ అకౌంట్ నుంచి ఏపీలో సినిమా టికెట్ల గొడవ మీద ఒక ట్వీట్ పడింది. ‘‘చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అన్నట్లుగానే.. ప్రతి పాఠశాలలోనూ ఒకటే ఫీజు, ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా?’’ అంటూ ఈ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వేయగా.. దాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని ఉటంకిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మీడియాకు చెప్పారు.
స్వయంగా మంత్రి త్రివిక్రమ్ ట్వీట్ గురించి ప్రస్తావించడంతో నిజంగా అతనలా ట్వీట్ వేశాడా అని వెతకడం మొదలుపెట్టారు జనాలు. కానీ అది ఫేక్ ప్రొఫైల్ అని తేలింది. ఇది త్రివిక్రమ్‌కు డ్యామేజింగ్‌గా అనిపించి.. ఆయనకు మాతృ సంస్థ అనదగ్గ హారిక-హాసిని క్రియేషన్స్ సంస్థ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. త్రివిక్రమ్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్లు లేవని.. ఏదైనా చెప్పాలనుకుంటే మీడియా ముఖంగా అధికారికంగానే ఆయన చెబుతారని.. ఇలాంటివి నమ్మొద్దని స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.