సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్ల కింద చెప్పిన మాటలు చూస్తే ఈపాటికి ఆయన ఎప్పుడో సినిమాలు మానేసి ఉండాలి. తాను రాజకీయ పార్టీ పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగబోతున్నట్లు ఆయన మూణ్నాలుగేళ్ల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే.
70 ఏళ్లకు చేరువ అవుతూ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఇక సినిమాలకు టాటా చెప్పేయబోతున్నట్లే అని అంతా అనుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టే విషయంలో ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోయింది. ఆ గ్యాప్‌లో చకచకా సినిమాలు లాగించేశారు.
చివరికేమో ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. కరోనా ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. చివరికి సినిమాల విషయంలోనూ రజినీ అంత ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది.
కరోనాకు ముందు మొదలుపెట్టిన ‘అన్నాత్తె’ సినిమాను అతి కష్టం మీద పూర్తి చేసిన రజినీ.. దీని తర్వాత సినిమాల్లో నటించడం పట్ల ఏమంత ఆసక్తిగా లేనట్లే కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో రజినీ తీరు గమనిస్తే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోటి ప్రకటించాడు.
కానీ ‘అన్నాత్తె’ చేస్తుండగా మాత్రం కొత్త సినిమా ఊసు ఎత్తలేదు. రాజకీయాల్లోకి వస్తే ‘అన్నాత్తె’నే సినిమా అవుతుందనుకున్నారు కానీ.. పొలిటికల్ ఎంట్రీ రద్దు చేసుకున్నా సరే ఆయనకు ఇదే చివరి సినిమాలా కనిపిస్తోంది. వయసు ప్రభావానికి తోడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో రజినీకి సినిమాలు చేసే ఓపిక తగ్గిపోయినట్లే కనిపిస్తోంది.
‘పేట’ తర్వాత రజినీతో కార్తీక్ సుబ్బరాజ్ ఇంకో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. అది కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ‘అన్నాత్తె’ సినిమా హిట్ అంటూ రజినీ పొంగిపోతుండొచ్చు కానీ.. ఈ సినిమా చూసి అభిమానులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వరుసగా పేలవమైన సినిమాలే చేస్తుండటంతో ఈ వయసులో, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఇంత కష్టపడి ఇలాంటి సినిమాలు చేయడం కన్నా ఆయన సినిమాలు మానేస్తే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రజినీ తీరు చూస్తుంటే ఆయనా ఆ నిర్ణయమే తీసుకునేలా కనిపిస్తోంది.