హీరోయిన్ల నోళ్ల‌న్నీ ఏమైపోయాయి?

దురాభిమానుల పైత్యానికి బ‌లైపోతోంది… మీరా చోప్రా. ‘ఎన్టీఆర్ గురించి నాకు తెలీదు’ అన్న పాపానికి… సోష‌ల్ మీడియా సాక్షిగా, ఎన్టీఆర్ దురాభిమానుల చేతుల్లో మీరా ప‌రువు అభాసుపాలైపోతోంది.

దీనిపై స్పందించాల‌ని ఎన్టీఆర్‌ని మీరా కోరినా.. ఫ‌లితం లేకుండా పోయింది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం మీరాకు మ‌ద్ద‌తు అనూహ్యంగా పెరుగుతోంది. నెటిజ‌న్లు.. మీరాకు వెన్నుద‌న్నుగా నిలిచారు.

కానీ ఇలాంటి స‌మ‌యంలో మాట్లాడాల్సిన క‌థానాయిక‌లే ఇంకా నోరు మెద‌ప‌డం లేదు. సాధార‌ణంగా మ‌హిళ‌ల‌పై అకృత్యాలు, అన్యాయాలు జ‌రిగిన‌ప్పుడు ట్విట్ట‌ర్లు బెంబేలెత్తేలా, సోష‌ల్ మీడియా.. హ‌డ‌లిపోయేలా పోస్టింగులు చేస్తుంటారు క‌థానాయిక‌లు.

మ‌రి.. మీరా చోప్రా విష‌యంలో వాళ్లెందుకు నోరు మెద‌ప‌డం లేదో అర్థం కావ‌డం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే, ఎన్టీఆర్ తోపెట్టుకున్న‌ట్టే అని భ‌య‌ప‌డుతున్నారా? లేదంటే ‘మా వ‌ర‌కూ రాలేదు క‌దా’ అని లైట్ తీసుకుంటున్నారా? మీరా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్‌. అదే ఫామ్ లో ఉన్న హీరోయిన్‌ని ఎవ‌రైనా ఏమైనా అంటే… ఈ గ్యాంగ్ అంతా ఊరుకునేదా? ఏదో విధంగా… స‌పోర్ట్ చేసేవారు క‌దా. ఆ మ‌ద్ద‌తే మీరా చోప్రాకి ఇప్పుడు క‌రువైంది.

ఇలాంటి విష‌యాల్లో చురుగ్గా స్పందించే స‌మంత లాంటి వాళ్లు కూడా మౌనంగా ఉండ‌డం… ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మునుముందైనా ఎవ‌రైనా నోరు విప్పుతారేమో చూడాలి.