‘హరిహర వీరమల్లు’.. బాలీవుడ్ స్టార్స్ తో పవన్ షూటింగ్!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను పూర్తి చేయడానికి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. దర్శకుడు క్రిష్ తన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను పునః ప్రారంభించాడు. ఈరోజు నుంచే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ ను సగానికి పైగా పూర్తి చేశారు. సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా షూటింగ్ ను కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను షురూ చేశారు. దీపావళి పండగ తరువాత నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారట. పవన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వారియర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. అది ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ఇక పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకు తెరపై చూడని విధంగా దర్శకుడు క్రిష్ ఆయన్ను ప్రెజంట్ చేయబోతున్నారు.