ఘాటు రొమాన్స్.. గట్టెక్కిస్తుందా?

పూరి జగన్నాథ్ తాను తీస్తున్న ‘లైగర్’ కంటే కూడా ఇంకో సినిమా ఫలితం మీద చాలా ఉత్కంఠతో ఉన్నాడిప్పుడు. ఆ సినిమానే.. రొమాంటిక్. పూరి కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన చిత్రమిది. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రతిభ చాటుకుని.. టీనేజీలోఉండగానే ‘ఆంధ్రాపోరి’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసిన ఆకాశ్‌కు ఆ చిత్రం కానీ.. ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోగా పరిచయం అవుతూ నటించిన ‘మెహబూబా’ కానీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

ఎంతోమంది స్టార్లకు భారీ విజయాలందించి వాళ్ల కెరీర్లను మరో స్థాయికి తీసుకెళ్లిన పూరి.. తన కొడుకును హీరోగా నిలబెట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కాకపోతే కొడుకు హీరో అయ్యే సమయానికి ఆయన అంత మంచి ఫాంలో లేడు. అందుకే ఫుల్ లెంగ్త్ హీరోగా ఆకాశ్ రెండో సినిమాను అనిల్ పాడూరి అనే కొత్త దర్శకుడి చేతుల్లో పెట్టాడు. కానీ ఈ చిత్రానికి కథ అందించింది మాత్రం పూరీనే.

ఇప్పటిదాకా ‘రొమాంటిక్’ నుంచి వచ్చిన టీజర్, రెండు ట్రైలర్లు, పాటలు, ఇతర ప్రోమోలు చూస్తే.. ప్రేక్షకుల్లో అనుకున్నంత ఎగ్జైట్మెంట్ అయితే కనిపించడం లేదు. పూరి తీసిన నేను నా రాక్షసి, రోగ్ లాంటి బ్యాడ్ లవ్ స్టోరీలనే ఈ సినిమా గుర్తుకు తెస్తోంది. కథాకథనాల పట్ల తక్కువ అంచనాలతోనే ఉన్నారు ప్రేక్షకులు. కాకపోతే ఈ సినిమా పట్ల యూత్‌లో ఆసక్తి అయితే బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు కారణం.. ప్రోమోల్లో కనిపిస్తున్న ఘాటు రొమాన్స్. హీరోయిన్ కేతిక శర్మ సూపర్ సెక్సీగా కనిపిస్తుండటం.. ఆకాశ్ ఆమెతో ఘాటు రొమాన్స్ పండించినట్లు ప్రోమోలను బట్టి తెలుస్తుండటంతో యువ ప్రేక్షకులు సినిమా పట్ల బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు.

ఈ సినిమాకు కుర్రకారును ఆకర్షించడం కోసమే అన్నట్లుగా సినిమాలో చాలా హాట్ హాట్‌గా సాగే ఒక పాటకు సంబంధించి పూర్తి వీడియో రిలీజ్ చేసేశారు. ఆ పాట చూశాక హీరోయిన్ అందాలను, ఆమెతో ఆకాశ్ ఘాటు రొమాన్స్‌ను పెద్ద తెరపై చూడాలని కుర్రాళ్లు తహతహలాడితే ఆశ్చర్యమేమీ లేదు. సినిమాలో ఈ అంశం యూత్‌ను బాగానే సంతృప్తి పరచవచ్చు. అంతకుమించి ఏమైనా ఉంటే అది వాళ్లకు బోనస్ అనుకోవాలి.