బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్ లో ఆరోపించారు.
ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి బాడీగార్డ్ అని చెప్పుకుంటున్న ప్రభాస్ అక్టోబర్ 2న క్రూజ్ షిప్ పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ ని సాక్షులుగా చేర్చి విచారించింది.
ఈ అరెస్ట్ ల తరువాత కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్‌లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు ప్రభాకర్. ఆ తరువాత షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో కారులోనే ఈ డీల్ గురించి పదిహేను నిమిషాల పాటు చర్చించారని ప్రభాకర్ చెప్పారు.
ఎన్సీబీ అధికారులు తనని ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని ప్రభాకర్ ఆరోపించారు. మరోపక్క కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం.. అతనిపై పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగడం ఖాయమనిపిస్తోంది. అయితే ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని.. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాఖండే తోసిపుచ్చినట్లుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాఖండే హెచ్చరించారు.