ఆర్ఆర్ఆర్.. దీపావ‌ళి ధ‌మాకా

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈపాటి దేశ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌కంప‌న‌లు రేపుతుండాలి. దేశం మొత్తం ఈ సినిమా గురించే చ‌ర్చించుకుంటూ ఉండాలి. ఇండియా అంత‌టా థియేట‌ర్ల‌లో ఈ సినిమా సంద‌డి చేస్తుండాలి. కానీ క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని అక్టోబ‌రు 13వ తేదీ నుంచి సినిమాను వాయిదా వేయక త‌ప్ప‌లేదు.
అంత‌కుముందే రెండుసార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రాన్ని ముచ్చ‌ట‌గా మూడోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వ‌చ్చింది. కొత్త రిలీజ్ డేట్ విష‌యంలో ప‌రిప‌రి విధాల ఆలోచించి.. అన్ని ప్ర‌త్యామ్నాయాలూ ప‌రిశీలించి చివ‌రికి 2022 జ‌న‌వ‌రి 7కు సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ అప్ప‌టికే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉండ‌టంతో ఆర్ఆర్ఆర్ కొత్త డేట్ విష‌యంలో ఆ చిత్రాల బృందాల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కానీ త‌మ‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో అదే డేట్‌కు ఆర్ఆర్ఆర్ టీంకు క‌ట్టుబ‌డి ఉంది. కాక‌పోతే ఇంకా ప్ర‌మోష‌న్లు మాత్రం మొద‌లుపెట్ట‌లేదు. కాగా విడుద‌ల‌కు స‌రిగ్గా రెండు నెల‌ల ముందు ప్ర‌మోష‌న్ల హోరు మొద‌లుపెట్ట‌నుంద‌ట చిత్ర బృందం. ఇందుకోసం దీపావ‌ళి పండుగ‌కు ముహూర్తం కూడా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.
గ‌త ఏడాది సీతారామ‌రాజు, కొమ‌రం భీంల మీద వేర్వేరుగా టీజ‌ర్లు వ‌దిలాడు రాజ‌మౌళి. ఇప్పుడు ఇద్ద‌రినీ క‌లిపి ఒక స్పెష‌ల్ టీజ‌ర్‌ను రెడీ చేస్తున్నాడ‌ట‌. మెరుపులు మెరిపించేలా.. సినిమా మీద అంచ‌నాలు మ‌రింత పెంచేలా ఈ టీజ‌ర్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్ గురించి అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌.

ఈ టీజ‌ర్ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా భారీగానే ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి ప్ర‌ణాళిక సిద్ధ‌మైంద‌ట‌. సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో పాటు ముంబ‌యి, బెంగ‌ళూరు, చెన్నై, కోచి లాంటి న‌గ‌రాల్లో ఈవెంట్ల‌తో సినిమాను బాగా జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి చిత్ర బృందం చూస్తున్న‌ట్లు స‌మాచారం.