‘మా’ ఎన్నికలు.. పాయింట్ పట్టుకున్న ప్రకాష్ రాజ్


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రగడ క పట్టాన ఆగేలా లేదు. ఎన్నికలు జరిగి రెండు వారాలు కావస్తున్నా.. దాని తాలూకు వేడి మాత్రం తగ్గట్లేదు. వివాదాలు ఆగట్లేదు. ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్ దౌర్జన్యంగా వ్యవహరించిందని, అక్రమాలకు పాల్పడిందని.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పోలింగ్ రోజు సీసీటీవీ పుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను కోరుతూ ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. కానీ ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ప్రకాష్ రాజ్ పోలీసులను ఆశ్రయించడం, వాళ్లొచ్చి సీసీటీవీ రూంకి తాళాలు వేసి విచారణ ఆరంభించడం తెలిసిందే. కాగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఓ సంచలన ట్వీట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో ఒక రౌడీ షీటర్ ఉన్నాడని.. అతను విష్ణు ప్యానెల్‌కు చెందిన వాడని ఆరోపించారు.

‘మా’ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో సదరు వ్యక్తి ఉన్న ఫొటోలను కూడా ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షూట్ ఉన్న నూకల సాంబశివరావు ‘మా’ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో హల్‌చల్ చేశాడని ప్రకాష్ రాజ్ అంటున్నారు.

ఓ హత్య కేసుతో పాటు మరి కొన్ని కేసుల్లో అతను నిందితుడని, అతడిపై రౌడీ షీట్ కూడా తెరిచారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఈ వ్యక్తి ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో తిరిగాడని.. ‘మా’తో సంబంధం లేని ఈ వ్యక్తిని పోలింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని.. ఇంకా ఇలాంటివి ఎన్నికల సందర్భంగా కొన్ని జరిగాయని, అందుకే సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నామని, ‘మా’ ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలియాలని ప్రకాష్ రాజ్ అన్నారు. సాంబశివరావు.. మోహన్ బాబు, విష్ణు, ఏపీ సీఎం జగన్‌లతో వేర్వేరుగా ఉన్న ఫొటోలను కూడా ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో షేర్ చేశారు.