‘ప్రైమ్’ ఛార్జీలు పెరిగిపోతున్నాయ్

ఇండియాలో ఓటీటీ విప్లవానికి ఒక రకంగా పునాది వేసింది అమేజాన్ ప్రైమ్ సంస్థే. నెట్ ఫ్లిక్స్ ప్రపంచ స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో ఇండియాలోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది అమేజాన్ ప్రైమ్. ఓటీటీ అంటే మన జనాల్లో చాలామందికి పెద్దగా తెలియని టైంలో ఎంట్రీ ఇచ్చి.. వివిధ భాషల్లో చాలా దూకుడుగా పెద్ద సినిమాలను మంచి రేట్లకు కొని థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా తక్కువ వ్యవధిలో రిలీజ్ చేయడం ద్వారా సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. మొదట్లో ఆఫర్ల కింద ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను ఐదొందలకే అందించిన ఘనత ప్రైమ్‌దే.

ఇంతకంటే తక్కువ ధరలకు ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఇచ్చిన సంస్థలు కూడా ఉన్నాయి కానీ.. అమేజాన్ ప్రైమ్‌తో పోలిస్తే అవి ఇచ్చిన కంటెంట్ చాలా తక్కువ. ఇక కరోనా టైంలో జనాలు బాగా ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడటంతో కంటెంట్ బాగా పెంచి, ఆ మేరకు సబ్‌స్క్రిప్షన్లు కూడా పెంచుకుని ఇండియాలో టాప్ ఓటీటీల్లో ఒకటిగా నిలిచింది ప్రైమ్.

ఐతే కొన్నేళ్ల నుంచి ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను 999 చొప్పునే అందిస్తూ వచ్చిన ప్రైమ్ సంస్థ.. ఇప్పుడు ధరలు పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల సబ్‌స్క్రిప్షన్ల ధరలూ 50 శాతం మేర పెరగబోతున్నాయి. వార్షిక ప్లాన్ 999 నుంచి 1499కి, మూడు నెలల ప్లాన్ 329 నుంచి 459కి, నెల ప్లాన్ 129 నుంచి 179కి పెరగబోతోంది. ఈ మేరకు అమేజాన్ నుంచి అధికారిక ప్రకటనే వచ్చింది.

ఐతే కొత్త ధరలు ఎప్పట్నుంచో అమల్లోకి వచ్చేది ఇంకా వెల్లడి కాలేదు. బహుశా కొత్త ఏడాదిలో కొత్త రేట్లు మొదలు కావచ్చేమో. గత రెండేళ్లలో ఓటీటీల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. జనాలు బాగా వీటికి అలవాటు పడ్డ క్రమంలో సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంచుతున్నారు. హాట్ స్టార్ ఇప్పటికే కొత్త ప్లాన్లను అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ ఆ బాటలో నడిచింది. ఇతర ఓటీటీలు అందించే కంటెంట్, వాటి సబ్‌స్క్రిప్షన్ ధరలతో పోలిస్తే అమేజాన్ బెటర్ అనే చెప్పాలి.