‘ఘోస్ట్‌’కి గెస్ట్‌గా ‘ఏజెంట్’

తండ్రి సినిమాలో కొడుకు, కొడుకు సినిమాలో తండ్రి గెస్ట్‌గా నటిస్తే వచ్చే కిక్కే వేరు. రామ్ చరణ్, చిరంజీవి విషయంలో ఆ కిక్‌ని ఎంజాయ్‌ చేశారు మెగా ఫ్యాన్స్. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ల ‘మనం’ కూడా అక్కినేని ఫ్యాన్స్‌కి ఆ సంతోషాన్ని పంచింది. ఇప్పుడు వారికి మరోసారి ఆ ట్రీట్ దక్కబోతోంది.

ఆల్రెడీ ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలాగే నాగార్జున ‘బంగార్రాజు’లో నాగచైతన్య యాక్ట్ చేస్తున్నాడు. త్వరలో అఖిల్ కూడా తన డాడ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాగ్‌తో ప్రవీణ్ సత్తారు తీస్తున్న ‘ద ఘోస్ట్‌’ మూవీలో అఖిల్ అతిథి పాత్రలో కనిపిస్తాడట. కొద్ది నిమిషాల పాత్రే అయినప్పటికీ కథకు చాలా ఇంపార్టెంట్ రోల్ అట. దానికి అఖిల్ అయితే పర్‌‌ఫెక్ట్ అని ప్రవీణ్ డిసైడయ్యాడని, నాగ్‌తో పాటు అఖిల్ కూడా ఓకే అన్నాడని సమాచారం.

విశేషమేమిటంటే.. ఈ మూవీలో నాగ్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. అఖిల్‌ కూడా ‘ఏజెంట్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఒకవేళ ప్రొఫెషనల్‌గా నాగ్‌కి హెల్ప్‌ చేసే మరో స్పెషల్ ఏజెంట్‌గా అఖిల్‌ కనిపిస్తాడేమోనని ఓ అంచనా. ఏదేమైనా ఈ ఇద్దరు ఏజెంట్స్ కలిసి స్క్రీన్‌పై కనిపించడమంటే ఫ్యాన్స్‌కి పండగే.