దంచుకుంటున్న బ్యాచిల‌ర్‌

సంక్రాంతి, దసరా లాంటి పండుగల సమయంలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎందుకు పోటీ పడతారో చెప్పడానికి ఇదే రుజువు. ఈసారి దసరాకు వచ్చిన మూడు చిత్రాల్లో దేనికీ పూర్తి పాజిటివ్ టాక్ రాలేదు. కానీ మూడింటికీ వసూళ్లు వాటి వాటి స్థాయిలో మెరుగ్గానే ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంలోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటనదగ్గ ‘పెళ్ళి సంద-డి’కి కూడా దసరా రోజు హౌస్ ఫుల్స్ పడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పండుగ రోజు ఏదో ఒక సినిమా చూద్దామని థియేటర్లకు వెళ్లిన వాళ్లకు టికెట్లు దేనికి అందుబాటులో ఉంటే ఆ చిత్రానికి వెళ్లిపోవడంతో ‘పెళ్ళి సంద-డి’ సైతం చెప్పుకోదగ్గ వసూళ్లే రాబట్టింది. ఇక ‘పెళ్ళి సంద-డి’, ‘మహాసముద్రం’ చిత్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉందన్న టాక్ రావడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అయింది. ఈ సినిమాకు తొలి రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

రెండు రోజుల్లో దాదాపు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఆదివారానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఈ రోజు కూడా మేజర్ సిటీస్, టౌన్స్‌లో హౌస్ ఫుల్స్ గ్యారెంటీనే. ఆదివారానికి గ్రాస్ కలెక్షన్లు రూ.25 కోట్లకు చేరువ అయ్యే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకంటే కూడా యుఎస్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు అదిరిపోయే స్పందన వస్తోంది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ యుఎస్ ఆడియన్స్ ఈ సినిమా పట్ల బాగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

గురువారం ప్రిమియర్స్‌తో కలిపి శనివారం నాటికి ఈ చిత్రం అమెరికాలో 3.5 లక్షల డాలర్లు కొల్లగొట్టడం విశేషం. ఫుల్ రన్లో హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. గత ఏడాది కరోనా టైం మొదలయ్యాక హాఫ్ మిలియన్ మార్కును నాలుగో చిత్రం కాబోతోంది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. లవ్ స్టోరి, వకీల్ సాబ్, జాతిరత్నాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది గొప్ప ఘనతగానే భావించాలి.