చిరంజీవిని పిలవనే లేదా?


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసిపోయి ఆరు రోజులు గడిచిపోయింది. ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాల వ్యవహారం రెండు మూడు రోజులు చర్చనీయాంశం అయింది. ఆది కూడా సద్దుమణిగిపోగా.. శనివారం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అధ్యక్షుడిగా మంచు విష్ణు.. అలాగే ఇతర కార్యవర్గ సభ్యులు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు.

ఐతే మంచు విష్ణు రెండు రోజుల ముందు ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణను ఆహ్వానించడం తెలిసిందే. కానీ ఆయన ఈ వేడుకలో పాల్గొనలేదు. బాలయ్యే కాదు.. మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ట్రీ పెద్దలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. విష్ణు తండ్రి మోహన్ బాబు, అలాగే గత అధ్యక్షుడు నరేష్ మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్న అతిథులు. మొన్న విష్ణు హడావుడి చూస్తే ఈ వేడుక పెద్ద స్థాయిలో జరుగుతుందని.. చిరంజీవి సహా చాలామంది పెద్దలు ఈ వేడుకలో పాల్గొంటారని అంచనా వేశారు.

కానీ ‘మా’ ఎన్నికలకు సంబంధించిన గొడవ.. ఎన్నికలు అయిన తర్వాత కూడా కొనసాగుతుండటంతో చిరంజీవి సహా అందరినీ పిలిచి హడావుడి చేయడం ఎందుకనుకున్నాడో లేక ప్రత్యర్థి వర్గానికి మద్దతుగా నిలిచిన చిరంజీవిని పిలవడం ఇష్టం లేదో కానీ.. విష్ణు అయితే చిరును కలవలేదని తెలుస్తోంది. బాలయ్య, ఇతర పెద్దలెవరైనా వస్తే ఈ వేడుకకు వస్తే విష్ణు తన వర్గాన్నే ఆహ్వానించినట్లు అవుతుందని ఆయన కూడా ఈ వేడుక రాలేదేమో అనిపిస్తోంది. విష్ణు ఒకవేళ చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడి ప్రమాణ స్వీకారం మామూలుగా చేసేద్దామనుకుంటున్నానని, కాబట్టి ఎవరినీ పిలవట్లేదని చెబితే చెప్పి ఉండొచ్చు.

ఏదేమైనప్పటికీ హడావుడి లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించడం ద్వారా విష్ణు మంచి పనే చేశాడని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇక ‘మా ’ ఎన్నికల గొడవ గురించి మీడియాలో ఏమీ మాట్లాడమని, ఇక ‘మా’ కోసం చేయాల్సిన పనుల మీదే దృష్టి పెడతామని స్పష్టం చేశాడు.