నరేష్ మీద ‘మెగా’ ఆగ్రహం

Naresh


సీనియర్ నటుడు నరేష్ గత పర్యాయం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మారడానికి పరోక్షంగా మెగా ఫ్యామిలీ సహకరించిందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎన్నికలకు ముందు నరేష్.. చిరంజీవిని కలవడం.. ఆయన మద్దతు తనకుందని ప్రకటించుకోవడం గమనార్హం. ఇక నరేష్ అధ్యక్షుడు అయ్యాక జీవిత, రాజశేఖర్‌లతో అతడికి ఇబ్బందులు తలెత్తితే.. ‘మా’ వివాదాలకు కేంద్రంగా మారితే.. అప్పుడు చిరంజీవే పెద్దరికం వహించి సమస్యను పరిష్కరించారు.

ఒక సమావేశంలో నరేష్‌ను రాజశేఖర్ విమర్శిస్తుంటే వారించి చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇలా నరేష్‌కు సహకరించిన చిరంజీవిపై ఇప్పుడు నరేష్ విషం చిమ్ముతున్నారనే అభిప్రాయం మెగా ఫ్యామిలీ వర్గాల్లో, అభిమానుల్లో బలంగా కలుగుతోంది. ఇందుక్కారణం ‘మా’ ఎన్నికలే.

చిరంజీవి మద్దతుతో ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీలో నిలిచినప్పటి నుంచి నరేష్ స్వరం మారిపోయింది. ప్రకాష్ రాజ్, నాగబాబు తన మీద పరోక్షంగా విమర్శలు గుప్పించడంతో ఆయన కొన్ని నెలల కిందటే ఎదురు దాడి మొదలుపెట్టారు. రాను రాను స్వరం పెంచారు. ప్రకాష్ రాజ్‌ మీద పోటీకి సై అన్న మంచు విష్ణుకు మద్దతుదారుగా మారి.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు, ఎన్నికలపుడు, ఆ తర్వాత నరేష్ వ్యవహరించిన తీరు మెగా వర్గాలకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తోంది. అన్నింటికీ మించి మంచు విష్ణు సక్సెస్ ప్రెస్ మీట్లో నరేష్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆగ్రహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద లేని లోటు ఏర్పడిందని.. ఆ స్థానాన్ని మోహన్ బాబు భర్తీ చేయాలని నరేష్ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. దాసరి తర్వాత పెద్దరికం వహిస్తున్నది చిరంజీవి అని అందరికీ తెలుసు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో చిరంజీవి చేసిన కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరు ఇంత చేస్తే.. ఇప్పుడు దాసరి లేని లోటు కనిపిస్తోందని, మోహన్ బాబు ఆ స్థానంలోకి రావాలని నరేష్ వ్యాఖ్యానించడం మెగా క్యాంపుకే కాదు.. ఇండస్ట్రీలో చాలామందికి రుచించడం లేదు.