మహాస‌ముద్రం క‌థ చాలామందికి చెప్పా కానీ..


మామూలుగా ఒక పెద్ద హిట్ మూవీతో ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కుడు.. ఆ వెంట‌నే చ‌క‌చ‌కా త‌ర్వాతి సినిమాల‌కు స‌న్నాహాలు చేసుకుంటాడు. రెండో సినిమాను వీలైనంత త్వ‌ర‌గా తీసేస్తుంటాడు. కానీ ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అజ‌య్ భూప‌తి మాత్రం రెండో సినిమాను పట్టాలెక్కించ‌డానికి రెండేళ్ల‌కు పైగానే ఎదురు చూడాల్సి వ‌చ్చింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. త‌న క‌థ‌కు త‌గ్గ హీరోలు దొర‌క్క‌పోవ‌డం.

ఈ సినిమాను నాగ‌చైత‌న్య‌, ర‌వితేజ లాంటి వాళ్ల‌కు చెప్పినా వాళ్లు ఒప్పుకున్న‌ట్లే ఒప్పుకుని నో చెప్పేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఒక హీరో త‌న‌కు హ్యాండ్ ఇవ్వ‌డం ప‌ట్ల అస‌హ‌నంతో చీప్ స్టార్ అంటూ ఒక కామెంట్ కూడా చేశాడు అజ‌య్ అప్ప‌ట్లో. ఆ హీరో ఎవ‌ర‌నే విష‌యంలో కొన్ని ప్ర‌చారాలు కూడా జ‌రిగాయి. ఐతే చివ‌రికి శ‌ర్వానంద్, సిద్దార్థ్‌ల‌ను హీరోలుగా ఖ‌రారు చేసి సినిమా మొద‌లుపెట్టాడు. ముగించాడు. అక్టోబ‌రు 14న ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో మ‌హాస‌ముద్రం ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ముందు జ‌రిగిన సంగ‌తుల‌ను అజ‌య్ గుర్తు చేసుకున్నాడు. ఈ క‌థ‌ను తాను చాలామంది హీరోల‌కు చెప్పాన‌న్నాడు. అజ‌య్ ఫైర్ బ్రాండ్ అన్న సంగ‌తి తెలిసిందే కాబ‌ట్టి.. త‌నీ మాటెత్త‌గానే ఎవ‌రి మీద ఏం విమ‌ర్శ‌లు చేస్తాడో, కౌంట‌ర్లు వేస్తాడో అని అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. కానీ అజ‌య్ వివాదాల జోలికి వెళ్ల‌కుండా పాజిటివ్ కామెంటే చేశాడు. ఇది ఇద్ద‌రు హీరోల క‌థ కావ‌డంతో కొంద‌రు ఈ చిత్రం చేయ‌డానికి వెనుకంజ వేశార‌ని, సోలో హీరో అయితేనే చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పార‌ని.. అలా నో చెప్పిన వాళ్లు కూడా వేరే వాళ్ల ద‌గ్గ‌ర మ‌హాస‌ముద్రం క‌థ గురించి గొప్ప‌గా చెప్పార‌ని అజ‌య్ అన్నాడు.

ఇక శ‌ర్వానంద్, సిద్దార్థ్‌ల‌తో ఈ సినిమా మొద‌లుపెట్టిన‌పుడు.. వీళ్ల‌ను ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాం అంటూ కొంద‌రు వార్నింగ్ ఇచ్చార‌ని.. కానీ ఆ ఇద్ద‌రూ త‌న‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించి, తానేం చెబితే అది చేశార‌ని అజ‌య్ తెలిపాడు. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని, ఇది రాసిపెట్టుకోవాల‌ని, పోస్ట‌ర్లు కూడా రెడీ చేసుకోవ‌చ్చ‌ని అజ‌య్ ధీమాగా చెప్ప‌డం విశేషం.