భలే సాహసం.. అంతరిక్షంలో 12 రోజుల షూటింగ్


రోదసిలోకి ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? శాస్త్రవేత్తలు వెళ్తారు. అంతరిక్ష ప్రయోగాల కోసం. ఐతే ఈ మధ్య స్పేస్ టూర్ పేరుతో సామాన్యులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రయోగాల కోసమో.. ఆసక్తితోనో కాకుండా.. ఒక సినిమా షూటింగ్ కోసమని ఒక బృందం అంతరిక్షంలోకి వెళ్లడం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశామా? ఇప్పుడు అదే జరుగుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే రష్యా నుంచే ఈ సాహస యాత్ర మొదలైంది.

‘ది ఛాలెంజ్’ అనే సినిమా షూటింగ్ కోసమని రష్యాకు చెందిన 37 ఏళ్ల నటి యులియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకో నింగిలోకి వెళ్లారు. కాస్మోనాట్ ఆంటోన్ ష్కాప్లెరోవ్ రష్యన్ సూయెజ్ స్పేస్ క్రాఫ్ట్లో వీరు ప్రయాణించారు.

సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో అంతరిక్షాన్ని చూపించాలంటే సెట్ వేస్తారు. లేదంటే గ్రాఫిక్స్ ట్రై చేస్తారు. కానీ రష్యాకు చెందిన ‘ది ఛాలెంజ్’ చిత్ర బృందం మాత్రం పెద్ద సాహసమే చేసింది. నేరుగా అంతరిక్షంలో షూటింగ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు.

డైరెక్టర్, హీరోయిన్ 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్ ఐఎస్ఎస్కు వెళ్లే సన్నివేశానికి సంబంధించిన షూట్ అక్కడ జరపనున్నారట. సినిమాలో ఈ సీన్ దాదాపు అరగంట ఉంటుందట. డాక్టర్ ప్రాత్రలో హీరోయిన్ యులియా నటిస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ ప్రాత్ర కోసం గత ఏడాది ఆడిషన్ నిర్వహించారు. ఇందులో యులియా ఎపంకియ్యాక అంతరిక్షంలో షూటింగ్ కోసమని ఆమె, దర్శకుడు కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. గత కొన్ని నెలల్లో వీళ్లిద్దరూ తలో 15 కిలోల చొప్పున బరువు కూడా తగ్గారు. ఈ షూటింగ్ విజయవంతంగా పూర్తయితే అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా రికార్డుకెక్కనుంది. ఇలా ఒక సినిమా టీం అంతరిక్షంలోకి వెళ్లి సినిమా తీయడం ఇదే మొదటిసారి. హాలీవుడ్ వాళ్లు కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు.