రిప‌బ్లిక్ ప‌రిస్థితేంటి?


సాయిధ‌ర‌మ్ తేజ్ చివ‌రి సినిమా సోలో బ్రతుకే సో బెట‌ర్ సోసోగా అనిపించింది అంద‌రికీ. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ చిత్రం ఓ మోస్త‌రుగా ఆడిందంతే. ఇక ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జ‌నాలు మ‌రిచిపోయారు. త‌మిళంలో స‌త్తా చాటుకున్న తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్‌కు తెలుగులో ఇప్ప‌టిదాకా స‌రైన విజ‌యం లేదు. ఇక నిర్మాత‌లు భ‌గ‌వాన్, పుల్లారావుల ప‌రిస్థితి ఏమీ బాగా లేదు. చివ‌ర‌గా వారి నుంచి వ‌చ్చిన రెబ‌ల్ ఎంత పెద్ద డిజాస్ట‌రో తెలిసిందే.

ఇలా రిప‌బ్లిక్ సినిమాలో భాగ‌మైన వాళ్లంద‌రికీ విజ‌యం చాలా అవ‌స‌రం. అందుకే ఈ సినిమాపై వాళ్లంద‌రూ చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. కానీ వాళ్ల ఆశ‌ల్ని రిప‌బ్లిక్ నిల‌బెట్ట‌లేదు. మంచి ప్ర‌య‌త్నం, నిజాయితీతో తీసిన సినిమా అన్న ప్ర‌శంస‌లు త‌ప్పితే సినిమాకు ఏమంత మంచి టాక్ రాలేదు. వ‌సూళ్లు అంతంత‌మాత్ర‌మే.

వీకెండ్లోనూ ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయ‌లేక‌పోయిన రిప‌బ్లిక్‌.. ఆ త‌ర్వాత పూర్తిగా చ‌ల్ల‌బడిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది. రిప‌బ్లిక్ బ్రేక్ ఈవెన్ మార్కు రూ.12 కోట్లు. ఐతే వీకెండ్లో ఈ సినిమా రూ.5 కోట్ల షేర్ మార్కును కూడా అందుకోలేక‌పోయింది. పూర్తిగా సీరియ‌స్ సినిమా కావ‌డం, ప్ర‌మోష‌న్ల హ‌డావుడి పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఈ సినిమాకు ప్రి రిలీజ్ బ‌జ్ పెద్ద‌గా లేదు. బుకింగ్స్ డ‌ల్లుగా జ‌రిగాయి.

తొలి రోజు టాక్ కూడా ఏమంత గొప్ప‌గా లేక‌పోవ‌డంతో తొలి వీకెండ్లో వ‌సూళ్లు సాధార‌ణ స్థాయిలోనే వ‌చ్చాయి. రూ.4.5 కోట్ల‌కు అటు ఇటుగా షేర్ వ‌చ్చింది. వీకెండ్లోనే జోరు చూపించ‌లేక‌పోయిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత మాత్రం ఎలా నిల‌బడుతుంది? నిల‌బ‌డ్డ‌ట్లు క‌నిపించ‌డం లేదు. బ్రేక్ ఈవెన్ మార్కుకు స‌గం ద‌గ్గ‌ర ఉన్న‌ ఈ సినిమా ఇక ముందుకు వెళ్ల‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది.