‘బుల్లెట్‌’ డేట్ ఫిక్స్.. ఈసారైనా గ్యారెంటీనా?

యాక్ష‌న్ హీరో గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ఆర‌డుగుల బుల్లెట్ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు నోచుకుంటోంది. గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటీమార్‌కు ఓ మోస్త‌రు టాక్, వ‌సూళ్లు రాగానే.. ఈ సినిమా విడుద‌ల గురించి స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. త్వ‌ర‌లో విడుద‌ల అంటూ కొత్త పోస్ట‌ర్ వ‌దిలారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. అక్టోబ‌రు 8న ఆర‌డుగుల బుల్లెట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

ఐతే ఏడెనిమిదేళ్ల కింద‌ట మొద‌లైన ఈ సినిమాకు మేకింగ్ ద‌శ‌లోనే చాలా ఆల‌స్యం జ‌రిగింది. రిలీజ్ విష‌యంలో మ‌రింత ఆల‌స్యం త‌ప్ప‌లేదు. నాలుగేళ్ల కింద‌ట సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి థియేట‌ర్లు బుక్ చేసి విడుద‌ల‌కు అంతా సిద్ధం చేశాక‌.. రిలీజ్ రోజు ఫైనాన్స్ స‌మ‌స్య‌లు త‌లెత్తడం.. విడుద‌ల అర్ధంత‌రంగా ఆగిపోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈసారైనా సినిమా ప‌క్కాగా విడుద‌ల‌వుతుందా.. మ‌ళ్లీ చివ‌రి నిమిషంలో ఏమైనా అవాంత‌రాలు ఎదుర‌వుతాయా అని చూడాలి. అక్టోబ‌రు 8న వైష్ణ‌వ్ తేజ్ సినిమా కొండ‌పొలంతో ఆర‌డుగుల బుల్లెట్ పోటీ ప‌డ‌నుంది.

ముందు భూప‌తి రాజా అనే త‌మిళ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను మొద‌లుపెట్టి.. మ‌ధ్య‌లో అత‌ను త‌ప్పుకుంటే సీనియ‌ర్ గోపాల్ చేతికి ఈ సినిమా వెళ్లింది. ఆయ‌నే సినిమాను పూర్తి చేశారు.ఇందులో అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార.. గోపీచంద్‌కు జోడీగా న‌టించింది. బాలాజి రియ‌ల్ మీడియా బేన‌ర్ మీద తాండ్ర ర‌మేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి క‌థ అందించింది వ‌క్కంతం వంశీ కావ‌డం విశేషం.