నాగబాబు నిష్క్రమించినట్లేనా?

మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు తన అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా ఉన్నారు. చిరంజీవి ఇంకా రంగంలోకి దిగకముందే.. ఆయన క్షేత్ర స్థాయిలో తిరగడం ద్వారా అభిమానులను రాజకీయ ప్రయాణానికి సిద్ధం చేయడం గుర్తుండే ఉంటుంది. ప్రజారాజ్యంలో పదవి తీసుకోకపోయినా.. ఆ పార్టీ కోసం తన వంతుగా చేయాల్సింది చేశారు.

ప్రజారాజ్యం పార్టీకి తెరపడ్డాక అన్నయ్య చిరంజీవితో విభేదించి పవన్ కొత్తగా రాజకీయ ప్రయాణం చేయాలనుకున్నపుడు.. తాను చిరంజీవి పక్షమే అని, అభిమానులు కూడా అటే ఉంటారని నాగబాబు చేసిన ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ జనసేన పార్టీ పెట్టిన కొంత కాలానికి నాగబాబు స్టాండ్ మారిపోయింది. తమ్ముడికి మద్దతుగా రంగంలోకి దిగాడు. ఆ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత కూడా పార్టీతో కొనసాగారు.

ఐతే ఇప్పుడు మళ్లీ నాగబాబు తీరు మారినట్లు కనిపిస్తోంది. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల గురించి కూడా మాట్లాడట్లేదు. పవన్‌కు మద్దతు ఇవ్వట్లేదని కాదు కానీ.. రాజకీయాలకు మాత్రం నాగబాబు దూరమైపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నాగబాబు అభిమానులతో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ చేశారు. ఇందులో రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు.. తనకు వాటిపై ఆసక్తి లేదని నాగబాబు చెప్పడం గమనార్హం. అంతే కాదు.. తన సిద్ధాంతాలు, అభిప్రాయాలు వేరైనప్పటికీ తుది శ్వాస విడిచే వరకు తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను విడిచిపెట్టనని అన్నారు. దీన్ని బట్టి జనసేనాని సిద్ధాంతాలతో నాగబాబు విభేదించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు రాజకీయాలపై ఆసక్తి లేనపుడు మీరు ప్రజలకెలా సాయం చేస్తారు అని ఓ అభిమాని అడిగితే.. “రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదా. అరరె నాకీ విషయం తెలియదే” అంటూ వ్యంగ్యంగా స్పందించారు నాగబాబు. ఈ వ్యాఖ్యల్ని బట్టి నాగబాబు రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే అనిపిస్తోంది. మరి ఈ స్టాండ్ ఇలాగే కొనసాగిస్తారా.. మళ్లీ ఎన్నికల సమయానికి జనసేనలోకి పునరాగమనం చేస్తారా అన్నది చూడాలి.