నెట్ ఫ్లిక్స్ బాహుబలి.. తీసేయలేదు, వచ్చేశాం


భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో అత్యంత కీలకంగా నిలిచిన శివగామి పాత్రను ఆధారంగా చేసుకుని ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివ‌గామి’ ఆధారంగా హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ఇండియాలో ఒక భారీ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కింద‌ట నెట్ ఫ్లిక్స్ స‌న్నాహాలు మొద‌లుపెట్టింది. కానీ ఒక ప‌ట్టాన ఈ సిరీస్ ప‌ట్టాలెక్క‌లేదు. టాలీవుడ్ దర్శకులు దేవా కట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం ప‌ని చేసి.. ఏవో కారణాల వల్ల దాని నుంచి తప్పుకోవడం తెలిసిందే.

త‌ర్వాత వేరే టీంను పెట్టుకుని స‌రికొత్త‌గా బాహుబ‌లి సిరీస్ తీయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది నెట్ ఫ్లిక్స్. ఇందులో నయనతార, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఐతే ఈ సిరీస్ నుంచి దేవా, ప్రవీణ్ ఎందుకు బయటికి వచ్చేశారన్నది వెల్లడి కాలేదు. నెట్ ఫ్లిక్స్ వాళ్లకు వీళ్ల పనితీరు నచ్చలేదని.. లేదు వీళ్లే ఆ ప్రాజెక్టు తమకు కాదని బయటికి వచ్చేశారని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పుడు దేవా కట్టా స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తన కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన దేవా.. నెట్ ఫ్లిక్స్ సిరీస్‌కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో వెల్లడించాడు.

“బాహుబ‌లి సిరీస్ ముఖ్యోద్దేశం ఇండియాలో ఒక ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా ఉండాలనే. ఐతే అలాంటి గొప్ప ప్రాజెక్టు ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో ఒక‌ట్రెండు సంవత్స‌రాల్లో చేసేది కాదు. దానికి చాలా సమయం వెచ్చించాలి. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’ కథను దాదాపు పదేళ్లు రాశారు. స్క్రీన్ ప్లే కోసం కూడా అంత సమయం పెట్టారు. సిరీస్ తీశారు. ఆపేశారు. మ‌ళ్లీ తీశారు. అలా ఎంతో క్లారిటీగా చేశారు. ఆ లెవ‌ల్ టీమ్ టెక్నీషియ‌న్స్‌, టైమ్‌, ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్‌పుట్ వ‌స్తుంద‌ని భావించి.. మా జీవితాన్నంతా ఆ సిరీస్ కోసమే వెచ్చించ‌లేమ‌ని అర్థం చేసుకుని రాసిందంతా అక్క‌డే పెట్టేసి ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాం. ఓ సీజ‌న్‌ను రాసుకుని తీసే ప్రాజెక్ట్ అది కాదు. కాస్త షూట్ చేసినా కూడా ప‌క్క‌కు వ‌చ్చేశాం” అని దేవా చెప్పాడు. దీన్ని బట్టి నెట్ ఫ్లిక్స్ వాళ్లు తీసేయడం కాదు.. దేవా, ప్రవీణ్‌లే ఈ ప్రాజెక్ట్ సెట్టవదని బయటికొచ్చేశారన్నమాట.