సంచలనం రేపి.. సైడైపోయి..

ఆర్ఆర్ మూవీ మేకర్స్.. ఒక టైంలో టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటిగా ఉన్న సంస్థ. దీని అధినేత ఆర్.ఆర్.వెంకట్‌కు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉండేది. కానీ చాలా ఏళ్ల నుంచి ఆయన పేరే వినిపించడం లేదు. ఇప్పుడు ఓ విషాద వార్త ఆయన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా వెంకట్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలే.

90వ దశకంలో కిషోర్ రాఠీతో కలిసి మంచి కుటుంబ కథా చిత్రాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి.. కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని తిరిగి తన బంధువైన వెంకట్ అండతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో వీళ్లిద్దరూ కలిసి మాయాజాలం, హంగామా లాంటి చిన్న చిత్రాలు నిర్మించిన వెంకట్.. ఆ తర్వాత కిక్, డాన్ శీను లాంటి చిత్రాలతో మీడియం రేంజ్ సినిమాలకు ఎదిగాడు. ఆపై బిజినెస్ మ్యాన్, ఢమరుకం లాంటి భారీ చిత్రాలతో టాలీవుడ్లో వెంకట్ పేరు మార్మోగింది.

ఐతే ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలో టాప్ బేనర్లలో ఒకటిగా ఎదిగే సమయానికి కూడా వెంకట్ అంటే ఎవరన్నది ఇండస్ట్రీ జనాలకు కూడా తెలియదు. మీడియా కంట పడకుండా.. ఎక్కడా తన ఫొటో రాకుండా జాగ్రత్త పడ్డ వెంకట్.. అచ్చిరెడ్డినే ముందు పెట్టి తన ప్రొడక్షన్ హౌస్‌ను నడిపించాడు. ‘బిజినెస్ మ్యాన్’తో భారీగా లాభాలు అందుకున్నాక.. వెంకట్ పేరు ఇండస్ట్రీలో మార్మోగింది.

ఇదే తరహాలో మరిన్ని భారీ చిత్రాలు తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడాయన. కానీ ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ మూవీ మేకర్స్’ కొన్ని ఫైనాన్స్ గొడవల్లో చిక్కుకుంది. దీంతో పెద్ద బడ్జెట్ పెట్టి తీస్తున్న ఢమరుకం, ఆటోనగర్ సూర్య చిత్రాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. వీటి విడుదల ఆలస్యమైంది. ఏవో సెటిల్మెంట్లు చేసి చాలా ఆలస్యంగా రిలీజ్ చేసిన ఈ రెండు చిత్రాలూ డిజాస్టర్లయ్యాయి. ఇక వెంకట్ కోలుకోలేకపోయాడు. ఒక టైంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిలా కనిపించిన వెంకట్.. ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఇప్పుడిలా మరణ వార్తతో ఆయన పేరు టాలీవుడ్లో మళ్లీ వినిపిస్తోంది.