వచ్చే నెల 22న మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన వచ్చిందో లేదో.. బాలీవుడ్‌లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అల్లాడిపోతున్న బాలీవుడ్లో కొత్త సినిమాల విడుదల బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే.
సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటిదాకా తెరుచుకోని థియేటర్లకు త్వరలోనే మోక్షం కలగనుండటంతో బాలీవుడ్లో రిలీజ్ డేట్‌ల అనౌన్స్‌మెంట్ల కోసం నిర్మాతల్లో పోటీ మొదలైంది. ఇక కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినట్లే, థియేటర్ల కష్టాలు తొలగినట్లే అని నిర్ణయానికి వచ్చేసిన బాలీవుడ్ నిర్మాతలు ఆదివారం ఒక్క రోజే 12 చిత్రాలకు రిలీజ్ డేట్లను ప్రకటించడం విశేషం.
బాలీవుడ్ నుంచి రాబోతున్న తొలి భారీ చిత్రం సూర్యవంశీ ఈ దీపావళికే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ లాల్ సింగ్ చద్దా మూవీ విషయానికొస్తే.. అది ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా కొంచెం ఆలస్యంగా, 2022 వేలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ సంస్థలో తెరకెక్కుతున్న నాలుగు చిత్రాలకు కొత్త రిలీజ్ డేట్లు ఇచ్చింది. బంటి ఔర్ బబ్లీ-2 నవంబరు 19, పృథ్వీరాజ్ 2022 జనవరి 21న, జయేష్ బాయ్ జోర్దార్ ఫిబ్రవరి 25న, షంషేరా మార్చి 22న విడుదల కానున్నాయి.
లాల్ సింగ్ చద్దా క్రిస్మస్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి రణ్వీర్ సింగ్ సినిమా 83 (కపిల్ దేవ్ బయోపిక్) వచ్చింది. దీపావళికి సూర్యవంశీతో వచ్చాక రెండు నెలలకే పృథ్వీరాజ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్షయ్ కుమార్.. ఇంకో రెండు నెలలకే అక్షయ్ కుమార్ 2022 మార్చి 4న బచ్చన్ పాండే మూవీతో పలకరించనున్నాడు.
ఆర్ఎక్స్ 100 రీమేక్ తడప్ ఈ ఏడాది డిసెంబరు 3న రానుండగా.. టైగర్ ష్రాఫ్ సినిమా హీరోపంటి-2 2022 మే 6న విడుదలవుతుంది. షాహిద్ కపూర్ నటించిన హిందీ జెర్సీ డిసెంబరు 31న థియేటర్లలోకి దిగనుంది. అక్షయ్ కుమార్ మరో చిత్రం రామ్ సేతు 2022 దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో నటిస్తున్న మే డే 2022 మే 29న.. కార్తీక్ ఆర్యన్-కియారా అద్వానీల చిత్రం బూల్ బూలయియా-2 2022 మార్చి 25న రిలీజ్ కానున్నాయి.