విజయ్‌ 66.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

ఇంతవరకు తన సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి ఎంటర్‌‌టైన్ చేసిన విజయ్.. ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తను తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేయనున్నాడనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఎవరూ కన్‌ఫర్మ్ చేయకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందేమోననే అనుమానం మొదలైంది. ఇప్పుడు దాన్ని పటాపంచలు చేస్తూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. విజయ్‌ 66వ సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లోనే ఉండబోతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌ దిల్‌ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

విజిల్, మాస్టర్ చిత్రాలతో తెలుగునాట కూడా విజయ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దాంతో అతనితో బైలింగ్వల్ తీయాలని ప్లాన్ చేశారు దిల్ రాజు. ఈ సినిమాకి చాలామంది ఫేమస్ యాక్టర్స్, టెక్నీషియన్స్ పని చేయబోతున్నారని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నామని ఆయన చెప్పారు.

ఇంతవరకు టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌‌గా వెలిగిన దిల్‌ రాజు.. నేషనల్‌ వైడ్ మూవీ మార్కెట్ మీద కన్నేశారని అర్థమవుతోంది. ఆల్రెడీ రామ్‌ చరణ్, శంకర్‌‌ల ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఇప్పుడు విజయ్‌తో మూవీ సెట్‌ చేశారు. మరి తన కోసం విజయ్ ఎలాంటి కథ రెడీ చేశాడో.. ఈ క్రేజీ కాంబో ఏం మ్యాజిక్ చేయబోతోందో!