పవన్ కళ్యాణ్ ని అభిమానులంతా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. పవన్ కి పవర్ స్టార్ అనేది పర్యాయ పదంగా మారిపోయింది. అయితే తన పేరు నుంచి పవర్ స్టార్ ను తీసేయమని మొన్నామధ్య పవన్ కళ్యాణ్ నిర్మాతలకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ‘భీమ్లా నాయక్’ టీజర్, పోస్టర్ లలో ఎక్కడా పవర్ స్టార్ అనే పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. పవన్ స్వయంగా పవర్ స్టార్ బిరుదుని తీసేయమని చెప్పడం నిజమేనా అనే సందేహాలు కలిగాయి. దానికి పవన్ క్లారిటీ ఇచ్చేశారు.
తాజాగా ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఈ ఈవెంట్ లో పవన్ తన స్పీచ్ తో అదరగొట్టాడు. ఏపీ గవర్నమెంట్ పై మండిపడటంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ‘పవర్ స్టార్’ జపం చేశారు. సుమ కూడా పవన్ ను స్టేజ్ పైకి పిలిచినప్పుడు పవర్ స్టార్ అనే ఆహ్వానించింది. దాంతో పాటు అభిమానులు కూడా ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.
దాంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ అంటున్నారు.. సుమ గారు కూడా పవర్ స్టార్ అనే పిలిచారు.. పవర్ లేని వాడికి పవర్ స్టార్ ఎందుకయ్యా.. తీసేయండి’ అంటూ నవ్వేశారు.
నిజానికి ఇలాంటి మాటలు ప్రత్యర్ధులు పవన్ కళ్యాణ్ ని అనాలి కానీ పవన్ తన మీద తనే సెటైర్ వేసుకున్నారు. అందుకే తెరపై కూడా పవర్ స్టార్ అనే పదం తొలగించమని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఉన్నారు. పవన్ ఎంత చెప్పినా కూడా అభిమానులు మాత్రం పవర్ స్టార్ అనే నినాదం మానేలా లేరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates