విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించింది రెండేళ్ల ముందు. షూటింగ్ మొదలు కావడంలో మామూలుగానే కొంత ఆలస్యం జరిగింది. చిత్రీకరణ మొదలయ్యాక కరోనా ప్రభావంతో సినిమా ఆలస్యం అయింది. చాలా స్పీడుగా సినిమాలు తీస్తాడని పేరున్న పూరి జగన్నాథ్.. తన కెరీర్లోనూ ఎన్నడూ లేనంత సుదీర్ఘ సమయం తీసుకుంటున్నాడు ఈ చిత్రానికి. ఈ ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
దీంతో విజయ్ ఓకే చేసిన వేరే సినిమాల పరిస్థితి డోలాయమానంలో పడింది. ‘లైగర్’ తర్వాత అతను శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. ఐతే తనకు ఖాళీ దొరక్కపోవడానికి తోడు.. కథ విషయంలో సంతృప్తి చెందక.. పైగా ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితం రాకపోవడం లాంటి కారణాలు కూడా తోడై ఈ చిత్రాన్ని విజయ్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఐతే విజయ్ నో అన్నప్పటికీ శివ ఈ కథనేమీ పక్కన పెట్టట్లేదు. అదే కథను అక్కినేని నాగచైతన్యతో తీయడానికి రెడీ అయినట్లు సమాచారం. శివతో ఇంతకుముందు ‘మజిలీ’ సినిమా చేశాడు చైతూ. ఆ సినిమా అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘టక్ జగదీష్’ అంత బాగా లేకపోయినా శివ మీద అతను నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుందని.. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.
చైతూ ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ సినిమాను కూడా అతను పూర్తి చేశాడు. ఒక హిందీ వెబ్ సిరీస్‌ను అతను ప్రస్తుతం అంగీకరించాడు. త్వరలోనే దీని షూటింగ్ మొదలు కానుంది. దీంతో సమాంతరంగా శివ సినిమాను అతను చేసే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates