ఒక మనిషి ఉన్నప్పటి కంటే పోయాక వాళ్ల విలువ ఎక్కువగా బోధపడుతూ ఉంటుంది. దర్శకరత్న దాసరి నారాయణరావును ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఆయనుండగా చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకొచ్చేవారు. పరిష్కారానికి ప్రయత్నించేవారు. ఎవరికే కష్టం వచ్చినా వ్యక్తిగతంగానో, పరిశ్రమ తరఫునో సాయం చేసేవారు. వివాదాలు తలెత్తినా పెద్ద మనిషిలా వ్యవహరించి అవి పెద్దవి కాకుండా చూసేవాళ్లు.
ఐతే ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏముంది ఇందులో అన్నట్లుగా చూశారు చాలామంది. ఇండస్ట్రీ జనాలు ఆయనకిచ్చే గౌరవం అందరికీ రుచించేది కాదు కూడా. ఐతే ఆయన అనుభవించే హోదా మాత్రమే అందరికీ కనిపించేది కానీ.. మనకెందుకు వచ్చిన తలనొప్పి అనుకోకుండా బాధ్యత తీసుకుని అన్నీ ముందుండి చేయడం అన్నది అంత సులువైన వ్యవహారం కాదు.
లోలోన ఎవరేమనుకున్నా దాసరి ఉండగా ఆయన్ని వేలెత్తి చూపిన వాళ్లు లేరు. అన్నేళ్ల పాటు ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా, ఎక్కడా వ్యతిరేకత బయటపడకుండా ఇండస్ట్రీకి పెద్ద మనిషిగా కొనసాగడం చిన్న విషయం కాదు. ఆయన వెళ్లిపోయాక ఇండస్ట్రీ మొత్తానికి ఆయన విలువ తెలిసింది. దాసరి లేని లోటును అందరూ ఫీలయ్యారు.
దాసరి మరణానంతరం కొంచెం గ్యాప్ తర్వాత చిరంజీవి ఆయన స్థానంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆయనకు మెజారిటీ సినీ జనాల మద్దతు లభించింది. కొంచెం కష్టమైనా చిరంజీవి కూడా బాధ్యత తీసుకుని అన్నీ ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు.
అంతా సవ్యంగా సాగుతోందనుకున్న తరుణంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నుంచి వ్యతిరేక స్వరం వినిపించింది. షూటింగ్‌ల పున:ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చా సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నాగబాబు మాటకు మాట అని వివాదాన్ని పెద్దది చేయడంతో చిరు ఆత్మరక్షణలో పడిపోయారు.
ఇందులో చిరు తప్పేముందన్నది పక్కన పెడితే.. సౌమ్యుడైన ఆయన ఇలాంటి వ్యవహారాల్లో కమాండింగ్‌గా వ్యవహరించడం కష్టమే. ఇలాంటి సందర్భాల్లో దాసరి ఉంటే కథ వేరుగా ఉండేది. ప్రస్తుత పరిణామాలు చూశాక దాసరి అన్నేళ్లు వ్యతిరేకత లేకుండా ఎలా ఇండస్ట్రీ పెద్దగా కొనసాగగలిగారు.. ఎలా అందరినీ అజమాయిషీ చేయగలిగారు అని సినీ జనాలకు ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates