రివ్యూలు సూపర్.. కానీ కలెక్షన్లు?

మ‌హాన‌టి సినిమా సాధించిన విజ‌యం చూశాక బ‌యోపిక్స్‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది సౌత్‌లో. జ‌నాలు పూర్తిగా మ‌రిచిపోయిన‌ ఒక న‌టి మీద తీసిన సినిమాకే అంత గొప్ప స్పంద‌న వ‌స్తే.. ఇప్ప‌టికీ జ‌నాల గుండెల్లో ఉన్న, న‌టుడిగానే కాక రాజ‌కీయ నాయ‌కుడిగానూ అత్యున్న‌త శిఖ‌రాల‌ను చేరుకున్న నంద‌మూరి తార‌క రామారావు మీద సినిమా తీస్తే ఇంకెంత రెస్పాన్స్ ఉంటుందో అని ఆయ‌న‌పై సినిమా తీస్తే అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ‌మైన ఫ‌లితాన్నందుకుంది.

య‌న్.టి.ఆర్-క‌థానాయ‌కుడు సినిమాకు మంచి రివ్యూలు వ‌చ్చినా ఫ‌లితం లేక‌పోయింది. ఇక య‌న్.టిఆర్-మ‌హానాయ‌కుడు సంగ‌తి స‌రేస‌రి. ఐతే య‌న్.టి.ఆర్ సినిమా సంగతి ముగిసిన వ్య‌వ‌హారం. ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజైన త‌లైవి సంగ‌తి చూద్దాం. ఈ చిత్రానికి త‌మిళం, తెలుగులో మంచి రివ్యూలొచ్చాయి.

హిందీ వెర్ష‌న్ రివ్యూలు సంగ‌తెలా ఉన్నా.. జ‌య‌ల‌లిత బ‌యోపిక్ మీద వాళ్ల‌కు ఆస‌క్తి లేద‌నుకోవ‌చ్చు. అక్క‌డ క‌లెక్ష‌న్లు మ‌రీ నామ‌మాత్రంగా ఉండ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ద‌క్షిణాదిన కూడా ఈ సినిమాకు తిర‌స్కారం త‌ప్ప‌లేదు. జ‌య‌ల‌లిత‌ను అమితంగా అభిమానించే త‌మిళ జ‌నాలు కూడా ఈ సినిమా ప‌ట్ల అంత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. త‌మిళ క్రిటిక్స్ 3.5, 4 రేటింగ్స్ ఇచ్చి సినిమాను ప్ర‌మోట్ చేసినా.. వ‌సూళ్లు అంతంత‌మాత్రంగానే ఉన్నాయి.

ఇప్ప‌టిదాకా అన్ని భాష‌ల్లో క‌లిపి త‌లైవికి రూ.5 కోట్ల వ‌సూళ్లు కూడా రాక‌పోవ‌డం అనూహ్యం. అందులో మేజ‌ర్ షేర్ త‌మిళ వెర్ష‌న్ నుంచి వ‌చ్చిందే. కానీ అవి కూడా చాలా త‌క్కువే అని చెప్పాలి. జ‌య‌ల‌లిత జీవితంలో అన్ని కోణాల‌నూ స్పృశించ‌కుండా క‌న్వీనియెంట్‌గా ఈ బ‌యోపిక్ తీయ‌డం ప్రేక్ష‌కుల‌కు రుచించిన‌ట్లు లేదు. నిర్మాతేమో నాన్-థియేట్రిక‌ల్ రైట్స్‌తోనే లాభాలొచ్చేశాయంటూ గొప్ప‌లు పోతున్నాడు కానీ.. ఈ చిత్రాన్ని న‌మ్ముకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌కు మాత్రం గ‌ట్టి దెబ్బే ప‌డింది.