పుష్ప టీం మాస్ట‌ర్ ప్లాన్


ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప ఒక‌టి. తెలుగు ప్రేక్ష‌కులే కాదు.. ఇత‌ర భాష‌ల వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్‌-2 లాంటి భారీ చిత్రాలు వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డిపోవ‌డంతో ఈ ఏడాదికి ఇక ఆశ‌ల‌న్నీ పుష్ప మీదే ఉన్నాయి.

పుష్ప ది రైజ్ పేరుతో రానున్న ఫ‌స్ట్ పార్ట్‌ను ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్ రిలీజ్ అన‌గానే డిసెంబ‌రు 25న వ‌స్తుంద‌న్న అంచ‌నాతో అంద‌రూ ఉన్నారు. కానీ పుష్ప టీం ఆలోచ‌న ఇంకో ర‌కంగా ఉంది. క్రిస్మ‌స్ స‌మ‌యానికి సినిమా థియేట‌ర్ల‌లో ఉంటుంది కానీ.. అంత‌కంటే ముందు నుంచే సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

క్రిస్మ‌స్ పండుగ‌కి వారం ముందే పుష్ప చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. డిసెంబ‌రు 17కు ఈ చిత్రాన్ని ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌రు 25కు హిందీ సినిమా లాల్ సింగ్ చ‌ద్దా కూడా షెడ్యూల్ అయి ఉండ‌టంతో దాంతో పోటీ ప‌డ‌టం వ‌ల్ల ఉత్త‌రాదిన ఆశించిన వ‌సూళ్లు రాక‌పోవ‌చ్చు. హిందీ బెల్ట్‌లోనూ పుష్ప మీద మంచి అంచ‌నాలే ఉన్న‌ప్ప‌టికీ.. ఆమిర్ సినిమాతో పోటీ ప‌డితే క‌ష్ట‌మే. అందుకే వారం ముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.

దీని వ‌ల్ల ముందు వారం సోలోగా దేశ‌వ్యాప్తంగా వ‌సూళ్ల మోత మోగించుకోవ‌చ్చు. సినిమాకు మంచి టాక్ వ‌స్తే లాంగ్ ర‌న్ ఉంటుంది. క్రిస్మ‌స్ వీకెండ్‌తో పాటు డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1 తేదీల్లోనూ మంచి వ‌సూళ్లు వ‌స్తాయి. కాబ‌ట్టి డిసెంబ‌రు 17కే ఈ సినిమా ఫిక్స్ అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్లు స‌మాచారం.