కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ ఏం చేయ‌బోతున్నారంటే..


ఈనాడు ప‌త్రిక ఆరంభ‌మై జ‌నాద‌ర‌ణ పొందిన తొలి నాళ్ల నుంచి ఆ ప‌త్రిక‌లో కార్టూనిస్ట్‌గా ఉంటూ.. 40 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకున్న వ్య‌క్తి శ్రీధ‌ర్. ఈనాడును, శ్రీధ‌ర్‌ను ఎవ్వ‌రూ కూడా వేరు చేసి చూడ‌లేనంత‌గా ఆ పత్రిక‌తో ఆయ‌నకు అనుబంధం ఉంది. కొన్నేళ్ల కింద‌టే రిటైర్మెంట్ వ‌య‌సు దాటేసిన‌ప్ప‌టికీ.. ఎక్స్‌టెన్ష‌న్ మీద ఆయ‌న ఈనాడు కార్టూనిస్ట్‌గా కొనసాగుతూ వ‌చ్చారు.

ఐతే ఇటీవ‌ల హ‌ఠాత్తుగా తాను ఈనాడు నుంచి బ‌య‌టికొచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు శ్రీధ‌ర్. ఇక అప్ప‌ట్నుంచి ఈనాడులో కార్టూన్ అన్న‌దే క‌నిపించ‌డం లేదు. ఈనాడు యాజ‌మాన్యంతో అభిప్రాయ భేదాల‌ని, ఆయ‌న‌కు కొంద‌రు పెద్ద‌లు పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టార‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క ఆయ‌న ఈనాడుకు గుడ్‌బై చెప్పార‌ని కూడా కొంద‌ర‌న్నారు.

ఐతే సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ప్ర‌చారాల‌ను శ్రీధ‌ర్ ఖండించారు కానీ.. తాను ఎందుకు ఈనాడు నుంచి వైదొలిగింది మాత్రం చెప్ప‌లేదు. ఇదిలా ఉంటే ఇక శ్రీధ‌ర్ విశ్రాంతి తీసుకుంటారా.. లేక వేరే మీడియా సంస్థ‌లో చేర‌తారా అన్న దానిపై అమితాస‌క్తి నెల‌కొంది. ఈ విష‌యంలో శ్రీధ‌ర్ క్లారిటీ ఇచ్చారు. అంత‌రార్థం పేరుతో తాను యూట్యూబ్ ఛానెల్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై ప్ర‌తివారం ఇందులో విశ్లేష‌ణ చేస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఐతే ఇది ఆదాయం కంటే కూడా ఒక వ్యాప‌కం లాగా చేయ‌డానికి శ్రీధ‌ర్ నిర్ణ‌యించుకున్నార‌ని.. జ‌నాల‌తో ట‌చ్‌లో ఉండ‌టానికి ఆయ‌న ఎంచుకున్న మార్గం ఇద‌ని.. వృత్తిగ‌తంగా అయితే ఆయ‌న రిటైరైన‌ట్లే అని శ్రీధ‌ర్ స‌న్నిహితులు చెబుతున్నారు. మ‌రి ఈ కార్య‌క్ర‌మంలో శ్రీధ‌ర్ కార్టూన్ల‌కు కూడా స్థానం ఉంటుంద‌ని, కోట్లాది త‌న అభిమానుల‌ను ఆయ‌న అల‌రిస్తార‌ని ఆశిద్దాం.