వెబ్ సిరీస్ కు మారుతి గుడ్ బై?

అదిగో ఆహా…ఇదిగో మారుతి వెబ్ సిరీస్ అంటూ వార్తలు వచ్చాయి. పైగా త్రీ రోజెస్ అనే టైటిల్. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటూ మరిన్ని వివరాలు. కానీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, మారుతి ఈ వెబ్ సిరీస్ చేయడం లేదు. చేయడం లేదు అంటే ఆయన డైరక్షన్ చేయడం లేదు. స్క్రిప్ట్, ఐడియా అన్నీ ఇచ్చేస్తారు. వేరే వాళ్లు డైరక్ట్ చేస్తారు.

అల్లు అరవింద్ తన ఓటిటి ప్లాట్ ఫారమ్ ఆహా కోసం కాస్త అవకాశం వున్న అందరి చేతా వెబ్ సిరీస్ చేయిస్తున్నారు. మారుతి కూడా ఆ విధంగానే ఈ లైన్ లోకి వచ్చారు. కానీ అరవింద్ వ్యవహారం తెలిసిందే. బడ్జెట్ పరిమితులు వుంటాయి. మారుతి సినిమా రెమ్యూనిరేషన్ పక్కన పెడితే, వెబ్ సిరీస్ కు కూడా ఇంతో అంతో కిట్టుబాటు కావాలి కదా?

పైగా ప్రతిరోజూ పండగే తరువాత మంచి హీరో మంచి హిట్ కనుక కొడితే వచ్చే రేంజ్ వేరుగా వుంటుంది. అందుకే దాని మీద కాస్త గట్టి దృష్టి పెట్టాలి. సో, అదీ, ఇదీ కలిసి మారుతిని వెబ్ సిరీస్ కు కేవలం స్క్రిప్ట్ వరకే పరిమితం చేసాయని బోగట్టా. కానీ మారుతి స్క్రిప్ట్ అన్న లేబుల్ వేరు. మారుతి డైరక్షన్ అన్న లేబుల్ వేరు. ఆ మాత్రం సంగతి అరవింద్ కు తెలియదునుకోవాలా?