అజయ్ భూపతిని కథ చెప్పమన్న ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ స్టార్ త్వరలోనే హాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు.. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉండగా.. మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు ధనుష్ తో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ ధనుష్ కి కథ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ధనుష్ స్వయంగా ఓ తెలుగు డైరెక్టర్ ని కథ చెప్పమని అడగడం విశేషం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనదైన ముద్ర వేసిన అజయ్ భూపతి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘మహాసముద్రం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా పోస్టర్లు, పాటలు ధనుష్ ని ఆకట్టుకోవడంతో అజయ్ భూపతిని కలవాలనుకున్నారు. షూటింగ్ కోసం గోవా వెళ్లిన ధనుష్ అక్కడకి అజయ్ భూపతిని పిలిపించి కథ ఏమైనా ఉంటే చెప్పమని అడిగారట. దీంతో అజయ్ భూపతి.. ధనుష్ కి తగ్గ కథ సిద్ధం చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ కథ గనుక ధనుష్ కి నచ్చితే వీరి కాంబినేషన్ లో సినిమా రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!