కత్రినా కైఫ్.. ఇండియాస్ ఫస్ట్ ఎవర్

బాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయిక కత్రినా కైఫ్‌తో ఓ సాహసోపేత సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. సల్మాన్ ఖాన్‌తో ‘సుల్తాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడతను. ఆ తర్వాత అతడితోనే ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ లాంటి సినిమాలు తీశాడు.

ఇప్పుడతను కెరీర్లో తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయబోతున్నాడు. అది కత్రినా కైఫ్‌తో కావడం విశేషం. ఆమె ఇప్పటిదాకా లేడీ ఓరియెంటెడ్ సినిమానే చేయలేదు. పైగా ఇప్పుడు అబ్బాస్ దర్శకత్వంలో కత్రినా చేయబోయేది సూపర్ హీరో ఫిలిం కావడం విశేషం.

ఇండియాలో మామూలుగానే సూపర్ హీరో సినిమాలు తక్కువ. ‘క్రిష్’ లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఇలా తెరకెక్కాయి. పాపులర్ అయ్యాయి. హీరోయిన్లను పెట్టి సూపర్ హీరో సినిమాలు తీసే సాహసం ఎవ్వరూ చేయలేదు.

హాలీవుడ్లో గాల్ గెడాట్ ప్రధాన పాత్రలో మూడేళ్ల కిందట వచ్చిన ‘వండర్ ఉమన్’ ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా రాబోతోంది త్వరలోనే. ఇండియాలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇదే స్టయిల్లో అలీ అబ్బాస్ జాఫర్.. కత్రినా ప్రధాన పాత్రలో సినిమా తీయబోతున్నాడు.

రూ.100 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ ప్రాజెక్టు విషయమై ప్రకటన రాగానే కత్రినా ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఆమెకు వండర్ ఉమన్ తరహా డ్రెస్సింగ్ వేసి ట్వీట్లు గుప్పిస్తున్నారు. నేషనల్ లెవెల్లో టాప్‌లో కత్రినా పేరు ట్రెండ్ అవుతోంది.

నటిగా ఏమంత మంచి గుర్తింపు లేకపోయినా.. గ్లామర్, డ్యాన్స్, యాక్షన్ లాంటి విషయాల్లో కత్రినాకు తిరుగులేదు. సూపర్ హీరో ఫిలింకి తగ్గ ఫీచర్స్ ఆమెలో ఉన్నాయి. మరి ఈ సినిమాతో కత్రినా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.