ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై ఎటూ తేల్చకుండానే మా సర్వసభ్య సమావేశం ముగిసిపోయింది. కరోనా నేపథ్యంలో ఆదివారం వర్చువల్‌గా ఈ సమావేశం నిర్వహించారు. సీనియర్ నటుడు మురళీ మోహన్, కృష్ణంరాజు, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, నరేష్ సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఈ సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి.
వీలైనంత త్వరగా, సెప్టెంబరులోనే నిర్వహించాలని ప్రకాష్ రాజ్ సహా కొందరు డిమాండ్ చేయగా.. మరికొందరేమో అక్టోబరులో ఎన్నికలు జరిపితే మంచిదన్నారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగిన 21 రోజుల్లో, అంటే సెప్టెంబరు 12న ఎన్నికలు జరపాలని.. కుదరకుంటే ఇంకో వారం రోజులు మాత్రమే సమయం తీసుకోవాలని.. అంతకుమించి ఆలస్యం చేయొద్దని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం అవసరమని ఆయనన్నారు.
ఐతే ఇంకో 21 రోజుల్లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదని మురళీ మోహన్ అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికలు జరపాల్సి ఉంటుందని.. కాబట్టి సెప్టెంబరు రెండో వారం నుంచి అక్టోబరు రెండో వారం వరకు అనువైన తేదీని చూసి ఎన్నికలు జరుపుతామని.. ఇంకో వారం రోజుల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని మురళీ మోహన్ అన్నారు.
ఇదిలా ఉండగా.. మా జనరల్ బాడీ మీటింగ్‌లో వాదోపవాదాలు జరగడం పట్ల మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. అలాగే మా కోసం ఇంతకుముందు బిల్డింగ్ కట్టి, దాన్ని తక్కువ ధరకు అమ్మేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్న భవనాన్ని అమ్మేసి ఇప్పుడు మళ్లీ బిల్డింగ్ కావాలనడం గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. మా సమావేశంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారని.. ఎవరికి వాళ్లు తాము గొప్ప అనుకుంటున్నారని ఆయన విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates