బొమ్మరిల్లు హాసిని.. అలా పుట్టింది

గత రెండు దశాబ్దాల్లో వచ్చిన తెలుగు సినిమాలను పరిశీలిస్తే.. అందులో బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్లలో ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఆ సినిమా అంత పెద్ద హిట్ కావడంతో హాసిని క్యారెక్టర్ ఎంతో కీలకం. అప్పట్లో ఆ పాత్ర ప్రేక్షకులను అలా ఇలా ఆకట్టుకోలేదు. చాలామంది అమ్మాయిలు హాసినిలా మారడానికి ట్రై చేస్తే.. అబ్బాయిలేమో హాసినిలా ఉండే అమ్మాయిని చేసుకోవవాలనుకున్నారు. అంతలా ఆ పాత్ర ఇంపాక్ట్ చూపించింది.

ఇంత మంచి పాత్ర రాయడానికి దర్శకుడు భాస్కర్‌కు ఏంటి స్ఫూర్తి అన్నది ఆసక్తికరం. తన జీవితంలో జరిగిన ఒక చిన్న ఘటనే ఇన్‌స్పిరేషన్‌గా ఆ పాత్రను తీర్చిదిద్దినట్లు తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో భాస్కర్ వెల్లడించాడు. ఈ పాత్ర రాయడానికి ముందు తాను చాలా కష్టపడ్డట్లు కూడా అతను తెలిపాడు. ఆ కథేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

“నేను ఆర్య సినిమాకు పని చేస్తున్నపుడే ఆ చిత్రం హిట్టయితే దర్శకుడిగా అవకాశం ఇస్తానని రాజు గారు చెప్పారు. అనుకున్నట్లే సినిమా హిట్టయింది. నన్ను కథ రెడీ చేసుకోమన్నారు. ముందు రెండు కథలు చెప్పాను. ఐతే అవి వద్దని.. మంచి ఫ్యామిలీ మూవీ చేద్దామని అన్నారు. తర్వాత ‘బొమ్మరిల్లు’ కథ చెబితే ఆయనకు నచ్చింది. ఐతే ముందు కథ చెప్పినపుడు హీరోయిన్ పాత్ర పెద్దగా లేదు. దాని మీద వర్క్ చేయమని రాజు గారు చెప్పారు. 15 రోజులు సమయం అడిగాను. నేను, వాసు వర్మ ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. ఐతే 14 రోజులు గడిచిపోయాయి. పాత్ర గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు. బాగా ఫ్రస్టేషన్ వచ్చేసింది. 15వ రోజు కూడా గడిచిపోయింది. ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు రాజు గారిని కలవాలి.

ఐతే తెల్లవారుజామున 4 గంటలకు వాసుతో డిస్కస్ చేస్తూ నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములొస్తాయి అని చెప్పి ఇంకోసారి ఢీకొట్టిందని వాసుతో చెప్పా. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. 15 రోజులు ఏమీ రాయని మేము.. ఆ ఐడియా రాగానే కేవలం రెండు గంటల్లో ఆ క్యారెక్టర్ మొత్తం రాసేశాం. ఆ పాత్ర కంప్లీట్ చేశాకే పడుకున్నాం. సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది, ఎవరు కావాలో చెప్పండి అన్నారు. జెనీలియాను ఎంచుకున్నాం. ఈ పాత్ర రాసినపుడే.. ఎవరు ఇందులో నటిస్తారో వాళ్లకు జాక్‌పాటే అనుకున్నాం. జెన్నీ మొదటి రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ.. మూడో రోజు నుంచి ఆ పాత్రను అర్థం చేసుకుని నటించడం మొదలుపెట్టింది. తను ఎంతగానో ఆ పాత్రను ఇంప్రొవైజ్ చేసింది. షూటింగ్‌లో ఆ పాత్ర ఇంకా మెరుగైంది” అని భాస్కర్ వివరించాడు.