నాలుగో వారమైనా.. క్లీన్ హిట్?

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం అయి మూడు వారాలు గడిచిపోయింది. ఇప్పటికే మూడు వారాంతాలు పూర్తయ్యాయి. ఈ మూడు వీకెండ్లలో రెండంకెల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు నామమాత్రంగా విడుదలైనవే. వాటినసలు ప్రేక్షకులు పట్టించుకోనే లేదు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో ప్రేక్షకుల దృష్టిలో పడ్డవి తిమ్మరసు, ఇష్క్, ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ మాత్రమే. ఈ చిత్రాల్లో వేటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. నిఖార్సయిన హిట్ అని ఏదీ అనిపించుకోలేదు.

అన్నింట్లోకి ‘తిమ్మరసు’కు డీసెంట్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు ఓ మోస్తరుగానే వచ్చాయి. ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంత జోష్ కనిపించలేదు. ‘ఇష్క్’ వాషౌట్ అయిపోయింది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ టాక్ బ్యాడ్. దీంతో ఆ సినిమాకూ చివరికి ఆశించిన ఫలితం రాలేదు. ‘పాగల్’ సినిమా పరిస్థితి కూడా ఇంతే.

ఈ వారం నాలుగైదు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. అన్నింట్లోకి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది, హైప్ తెచ్చుకున్నది అంటే.. ‘రాజ రాజ చోర’నే. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు హాసిత్ గోలి రూపొందించిన సినిమా ఇది. దీని గురించి శ్రీ విష్ణు ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు ప్రి రిలీజ్ ఈవెంట్లో. అతనన్నాడని కాదు కానీ.. ‘రాజ రాజ చోర’ టీజర్, ట్రైలర్ చూస్తే స్యూర్ షాట్ హిట్ లాగా కనిపించింది.

ఈ సినిమా కచ్చితంగా రీస్టార్ట్ తర్వాత టాలీవుడ్‌లో నిఖార్సయిన తొలి హిట్ అవుతుందన్న అంచనాలున్నాయి. ప్రిమియర్స్‌లో మంచి టాకే తెచ్చుకున్నప్పటికీ.. గురువారం సామాన్య ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన ఉంటుంది.. బాక్సాఫీస్ దగ్గర దీనికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అన్నది కీలకం. దీంతో పాటుగా క్రేజీ అంకుల్స్, కనబడుట లేదు, బజార్ రౌడీ లాంటి చిత్రాలు వస్తున్నప్పటికీ వాటిపై పెద్దగా అంచనాల్లేవు. వాటిలో ఏవైనా సర్ప్రైజ్ హిట్లవుతాయేమో చూడాలి.