పెళ్లి రద్దు.. ఛాన్సులే ఛాన్సులు

మెహ్రీన్ పిర్జాదాను ఇక మళ్లీ సినిమాల్లో చూడలేమని కొన్ని నెలల ముందు వరకు ఆమె అభిమానులు ఎంతగా ఫీలయ్యారో. ఎందుకంటే కెరీర్ బాగానే సాగుతుండగానే ఆమె పెళ్లికి రెడీ అయిపోయింది. పంజాబ్‌లో మంచి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందిన భవ్య అనే కుర్రాడితో ఆమె ప్రేమలో పడటం.. వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం.. పెళ్లికి రెడీ అవడం తెలిసిందే.

కరోనా లేకుంటే గత ఏడాదే పెళ్లి కూడా అయిపోయేదో ఏమో. కానీ మహమ్మారి కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కానీ కొన్నాళ్లు ట్రావెల్ చేశాక ఇద్దరికీ సరిపడదని తేలింది. దీంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయంలో మెహ్రీనే ముందడుగు వేసినట్లుగా కనిపిస్తోంది. సినిమాల విషయంలో భవ్య కుటుంబం నుంచి అభ్యంతరాలు రావడంతోనే ఆమె నిశ్చితార్థం రద్దు చేసుకుని ఉండొచ్చనే గుసగుసలు వినిపించాయి. ఆ సంగతలా వదిలేస్తే పెళ్లి రద్దు తర్వాత మెహ్రీన్‌కు మంచి మంచి ఛాన్సులే వస్తున్నాయి.

పెళ్లికి ముందు ‘ఎఫ్-2’ మినహా మెహ్రీన్ చేతిలో సినిమాలు లేవు. ప్రేమ.. పెళ్లి అనగానే మెహ్రీన్‌ను ఫిలిం మేకర్స్ అప్రోచ్ కావడమే మానేసినట్లున్నారు. ఐతే భవ్యతో పెళ్లి రద్దు చేసుకోగానే కొన్ని నెలల్లో ఆమె చేతికి రెండు సినిమాలొచ్చాయి. అందులో ఒకటి.. మంచి రోజులు వచ్చాయి. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ నటించిన ఈ చిత్రం కేవలం నెలన్నర రోజుల్లో పూర్తయిపోయింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలోనే మెహ్రీన్‌కు ఒక సూపర్ స్టార్ సినిమాలో ఛాన్సొచ్చింది. ఆ హీరోనే.. శివరాజ్ కుమార్.

కన్నడలో చాలా పెద్ద హీరో అయిన శివరాజ్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. అందులో మెహ్రీనే కథానాయిక. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా మెహ్రీన్ హాజరైంది. కన్నడలో అరంగేట్రమే శివరాజ్ కుమార్ సినిమా కావడం మెహ్రీన్ అదృష్టమే. ఈ సినిమా బాగా ఆడితే కన్నడలోనూ ఆమె బిజీ అయిపోయే ఛాన్సుంది. మొత్తానికి పెళ్లి రద్దు చేసుకుని మెహ్రీన్ తన కెరీర్‌ను బాగానే పొడిగించుకుంటోంది.