అనుష్క మళ్లీ తప్పు చేస్తుందా?


తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్న కథానాయిక అనుష్క. గత దశాబ్దంన్నరలో టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లను చూశాం. గ్లామర్, యాక్టింగ్ విషయంలో ఎవరికి వాళ్లే సాటే అనిపించే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ అనుష్క లాంటి స్థాయి మాత్రం ఎవరూ అందుకోలేదు. కెరీర్ ఆరంభంలోనే ‘అరుంధతి’తో ఆమె ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూ అందుకున్న విజయాలకు తోడు రుద్రమదేవి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె ఎవ్వరూ అందుకోలేని స్థాయిని చేరుకుంది.

ఐతే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో కొన్నిసార్లు అనుష్క తప్పటడుగులూ వేసింది. మరో ‘అరుంధతి’ అవుతుందనుకున్న ‘పంచాక్షరి’.. గొప్ప ప్రయోగం అవుతుందనుకున్న ‘సైజ్ జీరో’.. ‘భాగమతి’ని మించి పోతుందనుకున్న ‘నిశ్శబ్దం’ ఏమయ్యాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

‘నిశ్శబ్దం’ తర్వాత మరోసారి గ్యాప్ తీసుకున్న స్వీటీ.. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్లో ఒక వెరైటీ సినిమా ఏదో చేయబోతోందన్నారు. దాని గురించి ఇప్పటిదాకా ఏ అప్‌డేట్ లేదు. ఐతే ఇప్పుడేమో తమిళ చిత్రం ‘నేత్రికన్’ రీమేక్‌లో అనుష్క నటించనుందంటూ ఓ ప్రచారం మొదలైంది. నయనతార ప్రధాన పాత్రలో ‘గృహం’ దర్శకుడు మిలింద్ రావు రూపొందించిన ఈ చిత్రం ఇటీవలే హాట్ స్టార్‌లో నేరుగా రిలీజైంది. ఐతే అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉండటం గమనార్హం.

మరి నెగెటివ్ టాక్ తెచ్చుకుని, తెలుగులో కూడా అందుబాటులో ఉన్న సినిమాను అనుష్క ప్రధాన పాత్రలో రీమేక్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఆల్రెడీ సైజ్ జీరో, నిశ్శబ్దం చిత్రాల్లో డీగ్లామరస్ రోల్స్ చేసి అనుష్క గట్టి ఎదురు దెబ్బలు తింది. అవి చాలవన్నట్లు ఇప్పుడు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలో, అది కూడా అంధురాలిగా కనిపించడం అంటే పెద్ద తప్పటడుగే అవుతుంది. అనుష్క అంత పని చేయదనే ఆశిద్దాం.