దళితులపై నటి షాకింగ్ కామెంట్స్.. కేసు నమోదు!

తమిళనాడుకి చెందిన మోడల్, నటి మీరా మిథున్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. గతంలో ఆమె కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె దళితులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దళితుల కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని ఆమె చెప్పడం కొందరిని ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ఈమె ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అందులో ఒక డైరెక్టర్ ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సదరు డైరెక్టర్ అనుమతి లేకుండా తన ఫోటోను తీసుకొని పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. ఇక్కడితో ఆగకుండా దళితులందరినీ కించపరుస్తూ ఆమె మాట్లాడడం దుమారం రేపుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేది దళితులే అని.. వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తుంటాయని ఘాటు కామెంట్స్ చేసింది.

తమిళ ఇండస్ట్రీలో ఎవరైనా దళితులు ఉంటే వాళ్లు వెంటనే బయటకు వెళ్లిపోవాలని.. వారి కారణంగానే క్వాలిటీ సినిమాలు రావడం లేదని చెప్పుకొచ్చింది. దళితులను కించపరిచే విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని దళిత పక్షపాత పార్టీ విఎస్ కె.. మీరా మిథున్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారాలు కూడా ఉండడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు నుండి మీరా మిథున్ ఎలా బయటపడుతుందో చూడాలి!