మణిరత్నం సార్.. ఏదో అనుకుంటే

మణిరత్నం లాంటి లెజెండర్ ఫిలి మేకర్ నిర్మాణంలో.. ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్ లాంటి మేటి దర్శకులు.. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, సిద్దార్థ్, రేవతి, పార్వతి లాంటి ప్రముఖ ఆర్టిస్టులు.. ఏఆర్ రెహమాన్, సంతోష్ శివన్ లాంటి గ్రేట్ టెక్నీషియన్స్ కలిసి ఓ ఆంథాలజీ ఫిలిం తీశారంటే దాని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది?

కరోనా కష్ట కాలంలో తమిళ ఇండస్ట్రీలో పని లేక కష్టపడుతున్న వారిని ఆదుకునే ఉద్దేశంతో ఇంతమంది ప్రముఖులు కలిసి నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో చేసిన ఆంథాలజీ ఫిలిం ‘నవరస’ టీజర్.. ట్రైలర్లతో ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారమే ఈ ఫిలిం రిలీజైంది. ఐతే ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఈ సిరీస్ చూసిన వాళ్లు చాలా వరకు నిరుత్సాహానికే గురవుతున్నారు. నవరసాల్లో ఒక్కో రసాన్ని ప్రతిబింబించేలా తొమ్మిది ఎపిసోడ్లు రూపొందగా ఇందులో రెండు మూడు మినహా అంత ఎఫెక్టివ్‌గా లేవు అనే అభిప్రాయం వినిపిస్తోంది.

అన్నింట్లోకి అరవింద్ స్వామి తొలిసారి దర్శకుడిగా మారి రూపొందించిన ‘రౌద్రం’ సెగ్మెంట్‌కు ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. అరవింద్ స్వామిలో మంచి దర్శకుడున్నాడనే అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్ కలిగించింది. అలాగే కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిసోడ్ ‘ప్రాజెక్ట్ అగ్ని’ కూడా బాగుందనే అంటున్నారు. యోగిబాబు ప్రధాన పాత్రలో హాస్య ప్రధానంగా సాగే ‘సమ్మర్ ఆఫ్ 1992’ కూడా ఓకే అంటున్నారు. మిగతా ఎపిసోడ్లన్నింటికీ థంప్స్ డౌన్ అంటున్నారు ప్రేక్షకులు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య చేసిన ఎపిసోడ్.. విజయ్ సేతుపతి-ప్రకాష్ రాజ్-రేవతి నటించిన సెగ్మెంట్ నిరాశకే గురి చేశాయి. మిగతా ఎపిసోడ్లకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఇంత గొప్ప టీం చేసిన ఆంథాలజీ ఫిలిం వారి స్థాయికి తగ్గట్లు లేదని.. ఎంతో ఆశిస్తే చాలా వరకు ఎపిసోడ్లను మామూలుగా లాగించేశారనే కామెంట్లు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.