బన్నీ అతణ్ని గెలవగలడా?


మొత్తానికి అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా పార్ట్-1 రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ముందు ఆగస్టు 13కు అనుకున్నప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్లాన్స్ మారిపోయాయి. సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అందులో ఫస్ట్ పార్ట్‌ విడుదలకు క్రిస్మస్ సీజన్‌ను ఎంచుకున్నారు. డిసెంబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే ఆరు నెలల్లో క్రేజీ సీజన్లంటే దసరా, సంక్రాంతిలే.

ఐతే దసరాకు ‘ఆర్ఆర్ఆర్’ ఖరారవ్వగా.. సంక్రాంతికి రాధేశ్యామ్, సర్కారు వారి పాట, పవన్-రానా సినిమాలు ఖరారవడం తెలిసిందే. అందుకే మధ్యే మార్గంగా క్రిస్మస్ సీజన్‌కు ఫిక్సయ్యాడు బన్నీ. ఏడాది చివర్లో సెలవుల సందడి ఉంటుంది. అలాగే కొత్త సంవత్సరాది కూడా కలిసొస్తుంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు బాక్సాఫీస్‌ను దున్నుకోవచ్చని ప్లాన్ చేసినట్లుగా ఉంది.

ఐతే మామూలుగా అయితే ఇబ్బంది లేదు కానీ.. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా కావడంతో అతడికి తెలుగు రాష్ట్రాల అవతల గట్టి పోటీ తప్పేట్లు లేదు. ఎందుకంటే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కొత్త సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సైతం క్రిస్మస్‌కే షెడ్యూల్ అయింది. బాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి లేక అక్కడి ప్రేక్షకులు ఉస్సూరుమంటున్నారు. ఈ ఏడాది చివరికి పరిస్థితులు బాగు పడతాయని, ఆ టైంకి ఆమిర్ ఖాన్ సినిమా వస్తే బాక్సాఫీస్ మోత మోగిపోతుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మామూలుగా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపొచ్చు.

ఆమిర్ సినిమా అంటే ఉత్తరాదిన సందడి మామూలుగా ఉండదు. దక్షిణాదిన కూడా ఆమిర్ సినిమాను బాగానే చూస్తారు. మరి పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్న ‘పుష్ప’కు గట్టి పోటీ ఎదురవడం ఖాయం. ముఖ్యంగా ఆమిర్ సినిమాను దాటి ఉత్తరాదిన ‘పుష్ప’ ప్రభావం చూపుతుందా అన్నది ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి మరి.