మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేస్తున్న ఆయన ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ ను పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు బాబీతో సినిమా చేయాల్సివుంది. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని దర్శకుడు బాబీ అంటున్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ అనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై బాబీ ఓ క్లూ ఇచ్చారు. ‘ఇది స్టార్ కి అభిమానికి మధ్య జరిగే కథ’ అని అన్నారు బాబీ. అంటే ఇప్పుడు చిరుకి తగిన ఫ్యాన్ ను వెతకాలన్నమాట. ఆ రోల్ లో మరో హీరో కనిపించే ఛాన్స్ ఉంది. బాబీ చెప్పిన ఈ స్టోరీ లైన్ వింటే మనకి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా గుర్తురాక మానదు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. స్టార్ హీరోని అభిమానించే ఆర్టీవో ఆఫీసర్ కథే ఈ సినిమా.
నిజానికి ఈ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా హక్కులు కొన్నట్లు ఎవరూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇప్పుడు బాబీ సినిమా స్టోరీ లైన్ వింటుంటే కచ్చితంగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ నుండి స్ఫూర్తి పొందారనిపిస్తుంది. నిజంగానే హక్కులు తీసుకొని తెలుగులో రీమేక్ చేస్తున్నారా..? లేక సోల్ పాయింట్ తీసుకొని తన స్టైల్ లో సినిమాను తెరకెక్కిస్తారా అనేది చూడాలి!